ఆయన యుగం తెలుగు వారికి స్వర్ణయుగం..
ఆయన పాలన సంక్షేమానికి చిరునామా..
ఆయన మాట విశ్వసనీయతకు మారుపేరు..
ఆయన సంతకం అభివృద్ధికి వీలునామా..
ఆయన రూపం మరపురాని తేజోమయం..
ఆయన బాట సత్వర నిర్ణయం, పేదోడికి లాభం..
జనరంజక పాలనతో అందరి వాడుగా మన్ననలందుకున్న ధీశాలి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి. నిలువ నీడలేని పేదలందరికీ ఇల్లుండాలనే సంకల్పంతో లక్షలాది ఇళ్లు కట్టించారు. ఉన్నత చదువులు అందని ద్రాక్ష అని దిగులు చెందుతున్న పేద విద్యార్థులను ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో ఆదుకున్నారు. ఉచిత విద్యుత్ ఫైల్‌పై సంతకంతో రైతు లోగిళ్లలో ఆనందం నింపారు. రైతు కష్టాలు తీరాలంటే జలయజ్ఞమే శరణ్యమని భావించి ఖర్చుకు వెరవక, ఇక్కట్లకు తొణకక ప్రాజెక్టులు కట్టారు. పేదవాడికి రోగమొస్తే ఆస్తులమ్ముకునే దుస్థితిని ఆరోగ్యశ్రీతో తప్పించారు. ఆపదలో ఉన్న వారిని కాపాడేందుకు 108ను కుయ్.. కుయ్.. అంటూ రోడ్లపై పరుగెత్తించారు.. 104తో గ్రామీణులకు వైద్యం అందించారు. ఆయన హయాంలో ఏదో ఒక రూపేణా ప్రస్తుత రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రతీ కుటుంబం లబ్ధి పొందిందనడం అక్షర సత్యం. పనిలో వేగం.. వ్యవస్థలపై అపార గౌరవం.. పాలన అంటే ఇలా ఉండాలంటూ పొరుగు రాష్ట్రాల ప్రశంసలు.. పేదల ఆరోగ్యంపై ఇంత శ్రద్ధా అంటూ ఆరోగ్యశ్రీపై పలు దేశాల ప్రతినిధుల ఆశ్చర్యం.. వెరసి తన అద్భుతమైన పథకాలతో కోట్లాది మంది గుండెల్లో చెరగని ముద్ర వేశారు. ఆయన మన నుంచి భౌతికంగా దూరమై ఎనిమిదేళ్లవుతున్న, ఆ రూపం.. ఆ చిరునవ్వు మన కళ్లెదుట మెదలుతోంది. ‘మళ్లీ ఆయన రాజ్యం రావాలి.. వ్యవసాయం పండుగ కావాలి.. పేదోది ఇంట నవ్వులు విరియాలి..’ అని సగటు ఆంధ్రుడు ఆకాంక్షిస్తున్నాడు.
లక్షలాది విద్యార్థులకు వరం.. ఫీజు రీయింబర్స్‌మెంట్
నిరుపేద కుటుంబాలకు చెందిన పిల్లలు డబ్బులేక చదువులను అర్ధంతరంగా ఆపేస్తుండడం వైఎస్ రాజశేఖరరెడ్డిని తీవ్రంగా కలచివేసింది. పేద విద్యార్థులను ఉన్నత విద్యావంతులను చేస్తే ఆ కుటుంబాలతోపాటు సమాజం సైతం పురోగమిస్తుందని నమ్మి ఆయన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకానికి శ్రీకారం చుట్టారు. డబ్బు లేదనే కారణంతో ఏ ఒక్కరూ చదువులు ఆపేయకూడదని, తాను అండగా ఉంటానని ఆయన భరోసా కల్పించారు. పిల్లల చదువులకయ్యే ఫీజులను పూర్తిగా ప్రభుత్వమే చెల్లిస్తుందంటూ సాహసోపేతమైన నిర్ణయాన్ని ప్రకటించారు. ఇంజినీరింగ్, వైద్య విద్య, మేనేజ్‌మెంట్‌తోపాటు ప్రొఫెషనల్ కోర్సులు అభ్యసించే పేద విద్యార్థులకు ఫీజ్ రీయింబర్స్‌మెంట్ పథకాన్ని వర్తింపజేశారు.
దాదాపు 11 లక్షల బలహీన వర్గాల కుటుంబాలు, 5 లక్షల ఎస్సీ కుటుంబాలు, 1.8 లక్షల గిరిజన కుటుంబాలు, 7.5 లక్షల మైనారిటీ కుటుంబాలు ఈ పథకం కింద లబ్ధిపొందాయి. ఒక్క 2009–10 ఆర్థిక సంవత్సరంలోనే ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద రూ.2,500 కోట్లు చెల్లించారంటే బడుగు వర్గాల సంక్షేమానికి వైఎస్ ఎంత ప్రాధాన్యం ఇచ్చారో అర్థం చేసుకోవచ్చు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకంలో 25 లక్షల మందికిపైగా విద్యార్థులు ప్రయోజనం పొందారు. ఉన్నత చదువులు దిగ్విజయంగా పూర్తి చేసుకున్నారు. జీవితాల్లో నిలదొక్కుకున్నారు. ఎంతో మంది డాక్టర్లు, ఇంజనీర్లుగా స్థిరపడ్డారు. 2009–10లో 25 లక్షల మంది ఈ పథకంతో ప్రయోజనం పొందగా, ప్రభుత్వం ఈ ఏడాది 14,76,436 మందిని మాత్రమే ఎంపిక చేయడం గమనార్హం.
పేదలకు ఆరోగ్య ‘సిరి’
ఆరోగ్యశ్రీ అంటే ఒక భరోసా.. ఒక సామాజిక భద్రత. వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనలో సామాన్య, మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి చేతుల్లోకి వచ్చిన సుదర్శన చక్రమే ఆరోగ్యశ్రీ కార్డు. అనారోగ్యం పాలై ఆర్థికంగా చితికిపోతున్న ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపిన వినూత్న పథకం ఆరోగ్యశ్రీ. ఈ పథకాన్ని 2007లో తొలిదశలో 3 జిల్లాల్లో ప్రవేశపెట్టారు. తొలుత 163 రకాల వ్యాధులకు చికిత్స అందించారు. 2008 నాటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తానికి విస్తరించారు. 2009 నాటికి 942 వ్యాధులకు ఉచితంగా చికిత్స అందించారు. ఒక్క క్యాన్సర్ బాధితులే దాదాపు 3 లక్షల మంది ఆరోగ్యశ్రీ కింద చికిత్సలు పొందారు. 3.5 లక్షల మంది గుండెజబ్బు బాధితులు చికిత్స చేయించుకుని ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.
పుట్టుకతోనే చెవుడు, మూగతో జన్మించిన వారికి కాక్లియర్ ఇంప్లాంట్స్ అమర్చేందుకు ఒక్కో చిన్నారికి రూ.6.5 లక్షలు వెచ్చించారు. 2007 అంటే సరిగ్గా పదేళ్ల క్రితం ఏటా రూ.1,400 కోట్లు ఒక పథకానికి ఖర్చు పెట్టడమా? అని చాలా మంది నోరెళ్లబెట్టారు. ఆరోగ్యశ్రీకి నేరుగా రూ.925 కోట్లు బడ్జెట్‌లో కేటాయించగా, ముఖ్యమంత్రి సహాయ నిధి కింద (సీఎంఆర్‌ఎఫ్) రూ.375 కోట్లు ఇచ్చేవారు. పేదల ఆరోగ్యం కోసం వైఎస్ హయాంలో ఏటా రూ.1,400 కోట్లు ఖర్చు చేసేవారు.
రాజన్న పాలనలో రైతన్నే రాజు
దశాబ్ద కాలం పాటు వరుసగా కరువు కాటకాలు, అప్పుల బాధలు, రైతన్నల ఆత్మహత్యలతో తల్లడిల్లిన ఆంధ్రప్రదేశ్‌లో 2004 తర్వాత నూతన శకం ఆరంభమైంది. రాష్ట్రానికి అన్నదాతలే వెన్నుముక అని నమ్మిన వైఎస్ రాజశేఖరరెడ్డి వారి సంక్షేమం కోసం అహర్నిశలూ శ్రమించారు. 2004 ఎన్నికల్లో విజయ దుందుభి మోగించి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వేదికపైనే ఉచిత విద్యుత్ ఫైలుపై తొలి సంతకం చేశారు. రూ.వేల కోట్ల పంట రుణాలను ఒక్క సంతకంతో రద్దు చేశారు. సాగుకు రూ.450 కోట్ల రాయితీలు ఇచ్చారు. 1998 జూలై 1 నుంచి ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.1.5 లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించారు. ప్రాధాన్యత క్రమంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి రూ.వేల కోట్ల నిధులు కేటాయించారు. రైతులను పీల్చిపిప్పి చేస్తున్న వడ్డీ వ్యాపారులకు ముకుతాడు వేసేలా చట్టం తీసుకొచ్చారు. రైతుల ఆత్మహత్యల నివారణకు ప్రతి జిల్లా కేంద్రంలో హెల్ప్‌లైన్ ఏర్పాటు చేశారు.
ఉచిత విద్యుత్ పథకంతో రైతులు ఎనలేని ప్రయోజనం పొందారు.
1994–2002 మధ్య హెక్టార్‌కు వరి దిగుబడి 2,609 కిలోల నుంచి 2,700 కిలోల మధ్య ఉంటే 2004 తర్వాత అది 3,111 కిలోలకు చేరింది. వ్యవసాయం దండగ కాదు పండగ అని నిరూపించారు. కల్తీ, నకిలీ విత్తనాల బెడద నివారించేందుకు రాష్ట్ర విత్తన నియంత్రణ బిల్లు–2004ను తీసుకొచ్చారు. విత్తనాలు మొలకెత్తకపోతే ఆయా కంపెనీలను బ్లాక్‌లిస్టులో పెట్టేలా చర్యలు తీసుకున్నారు. రూ.25 కోట్లతో ప్రతి జిల్లా కేంద్రంలో విత్తన పరీక్ష ప్రయోగశాలను ఏర్పాటు చేశారు. 275 మండలాలలో వ్యవసాయాధికారులను నియమించారు. శ్రీ వరి సాగుకు ప్రోత్సాహం అందించారు. అంతకు ముందు తొమ్మిదేళ్ల చంద్రబాబు నిరంకుశ పాలనలో రైతున్నలు నలిగిపోయారు. ఏటా విద్యుత్ చార్జీలను పెంచడంతో వ్యవసాయం వదిలేసి, వలసబాట పట్టారు. కరెంటు బకాయిలు చెల్లించాలంటూ ప్రభుత్వం రైతులను వేధించింది. చెల్లించని వారిపై కేసులు పెట్టి జైళ్లకు పంపించింది.
వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చిన తొలిరోజే రూ.1,259 కోట్ల వ్యవసాయ విద్యుత్ బకాయిలను రద్దు చేశారు. దీనివల్ల 40 లక్షల మంది అన్నదాతలు ప్రయోజనం పొందారు. వైఎస్సార్ 30 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు ఉచిత విద్యుత్ ఇచ్చారు. 2004కు ముందు కరెంట్ చార్జీలను అప్పటి పాలకులు 8 సార్లు పెంచారు. ఐదేళ్ల వైఎస్ పాలనలో ఒక్కసారి కూడా విద్యుత్ చార్జీలను పెంచలేదు.
2007 నుంచి 2012 నాటికి ఉమ్మడి ఏపీలో ఆరోగ్యశ్రీ లబ్ధిదారులు:
జబ్బు లబ్ధిదారులు
క్యాన్సర్ 3.02 లక్షలు
ప్రమాదాలు 1.66 లక్షలు
గుండె జబ్బులు 1.63 లక్షలు
మూత్ర సంబంధిత 1.23 లక్షలు
కిడ్నీ జబ్బులు 1.11 లక్షలు
న్యూరో సర్జరీ 85 వేలు
గర్భకోశవ్యాధులు 55 వేలు
పీడియాట్రిక్ సర్జరీ 45 వేలు
న్యూరాలజీ 42 వేలు
చెవి, ముక్కు, గొంతు 40 వేలు
కార్డియో ఎక్స్‌క్లూజివ్ 39 వేలు
ఇతర వ్యాధులు 2.50 లక్షలు
నిర్ణయాల్లో 'వేగం..' వ్యవస్థలపై 'గౌరవం'
ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్. రాజశేఖర్‌రెడ్డి తీసుకున్న నిర్ణయాలన్నీ ప్రజలను దృష్టిలో పెట్టుకుని తీసుకున్నవే. ఏ నిర్ణయం తీసుకున్నా పేదలకు మేలు చేసేదిలా ఉండాలన్నదే ఆయన లక్ష్యం. ప్రధానంగా ప్రజాస్వామ్య వ్యవస్థలకు వైఎస్ ఎంతో గౌరవం ఇచ్చేవారు. తాను ముఖ్యమంత్రిగా ఏ వ్యవస్థలోనైనా జోక్యం చేసుకోవచ్చుననే ఆలోచన.. ప్రయత్నం పొరపాటున కూడా వైఎస్ చేయలేదు. కొన్ని సందర్భాల్లో అధికారులతో పాటు మీడియాకు చెందిన వారు కూడా మీరు (వైఎస్) ఒకసారి ఫలానా వారితో మాట్లాడితే బాగుంటుందని సూచించిన సందర్భాల్లో కూడా వైఎస్ చాలా తేలిగ్గా స్పందిస్తూ ఎవరు చేసే పని వారు చేయాలంటుండే వారు. ప్రజాస్వామ్యంలో ఏ వ్యవస్థకు చెందిన పని ఆ వ్యవస్థ చేయాలనే వారు. తుపాను తదితర విపత్తులు సంభవించి ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ప్రచారం కోసం ఏనాడు ప్రయత్నించలేదు. ఆపదలో ఉన్న ప్రజలను ఆదుకోవడానికి నిబంధనలు అడ్డువస్తున్నాయని అధికార యంత్రాంగం వివరిస్తే వైఎస్ స్పందన చూసిన ఆ అధికారులు ఇప్పటికే మరిచిపోలేక పోతున్నారు.
కారుణ్య నియామకాల విషయంలో నిబంధనలు అంగీకరించడం లేదని అధికారులు పేర్కొంటే.. వాటిని సవరించి మరీ సాయం అదించారని అధికార యంత్రాంగం చెబుతూ ఉంటుంది. బియ్యం ధరలు పెరగడంతో ఒక రోజు హైదరాబాద్‌లోని సచివాలయంలో సీఎం కార్యాలయ అధికారులతో వైఎస్ సమీక్ష నిర్వహించారు. పావు గంట సమీక్షలో రెండు రూపాయలకు కిలో బియ్యం పథకం అమలు చేద్దామని ముఖ్యమంత్రి వైఎస్ నిర్ణయించడంతో సీఎం పేషీ అధికారులందరూ విస్తుపోయారు. కొంత సమయం తీసుకుందామని అధికారులు సూచించారు. ఆ వెంటనే ‘రెండు రూపాయల కిలో బియ్యం పథకం అమలు చేస్తున్నాం.. వెంటనే మీడియాకు తెలియజేయండి.. రెండు రోజులు ఆలస్యం అయితే అధికారులు రకరకాల విశ్లేషణలతో సాధ్యం కాదంటారు’ అని వైఎస్ ఆదేశించారు.
జనం గుండెల్లో మహానేత
Reviewed by surya
on
12:44 AM
Rating:
No comments: