చార్జి 'చీటర్'... సీబీఐ!
ఇది... పంజరంలో చిలుక కథ! సర్కారు చేతిలోని కీలుబొమ్మ కథ!!
ఎవరిపై ప్రయోగిస్తే వారిని కేసులతో వేధించుకుతినే
కేంద్ర దర్యాప్తు సంస్థ కథ!!
జననేతగా ఎదిగిన జగన్‌మోహన్‌రెడ్డిని జైలులో పెట్టేందుకు
కాంగ్రెస్ అధిష్టానం ప్రయోగించిన సీబీఐ అనే ఆయుధం కథ!!
ఆరంభించిన నాటి నుంచీ ఏ రోజూ సక్రమంగా సాగని దర్యాప్తు.. ఇప్పటికీ సాగుతూనే ఉంది. ఒక ఎంపీగా, రాజకీయ పార్టీ అధినేతగా, వైఎస్సార్ వారసుడిగా తన ప్రజలతో కలవటానికి జగన్‌మోహన్‌రెడ్డి బెయిలు కోసం దరఖాస్తు చేసినపుడల్లా.. మాయల ఫకీరు చేతిలో దండంలా పైకి లేస్తూనే ఉంది. దాదాపు 21 నెలలుగా ఈ రాష్ట్రంలో దర్యాప్తు పేరిట సీబీఐ సాగిస్తున్న రాజకీయ మేధం తీరుతెన్నులివి....
జగన్‌మోహన్‌రెడ్డి సంస్థల్లోకి వచ్చిన పెట్టుబడులపై సమగ్ర దర్యాప్తు జరపాలని సీబీఐని ఆదేశిస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పునిచ్చింది 2011 ఆగస్టు 10న. మూడు రోజుల్లో తీర్పు కాపీ ఆగమేఘాలమీద సీబీఐకి అధికారికంగా చేరింది. మధ్యలో రెండు రోజులు సెలవులూ వచ్చాయి. కానీ ఈలోపే సీబీఐ సిబ్బందిని సమీకరించుకుంది. 28 ప్రత్యేక బృందాల్ని ఏర్పాటు చేసింది. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డిని ప్రధాన కుట్రదారుగా పేర్కొంటూ 17వ తేదీన ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. ఆ తర్వాత కొన్ని గంటలకే.. అంటే 18వ తేదీన మూకుమ్మడి దాడులు మొదలుపెట్టింది. భారతి సిమెంట్స్, ‘సాక్షి’లో పెట్టుబడులు పెట్టిన వారి ఇళ్లు, కార్యాలయాలపై ఏకకాలంలో దాడులకు దిగింది. ‘సాక్షి’ ప్రధాన కార్యాలయంలో సోదాలు చేసి రికార్డుల్ని, కంప్యూటర్లను, సమాచారాన్ని స్వాధీనం చేసుకుంది. పలువురిని పిలిచి ప్రశ్నించింది. ఒకరకమైన టై సృష్టించింది.
వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సంస్థల్లో పెట్టుబడి పెట్టాలంటేనే వణికిపోయేలా భయపెట్టింది. ఆ తరవాత.. కేసులో రెండో నిందితుడిగా ఉన్న ఆడిటర్ విజయసాయిరెడ్డిని, ఇన్వెస్టర్లను, అధికారుల్ని, ఇతరులను పలుమార్లు ప్రశ్నించింది. చిత్రమేంటంటే.. ఇదంతా ఎల్లోమీడియాలో ‘ప్రత్యక్ష ప్రసారం’ అవుతూనే వచ్చింది. సీబీఐ రహస్యంగా రికార్డు చేసిన స్టేట్‌మెంట్లు కూడా బహిరంగ ప్రకటనల మాదిరి ప్రచురితమయ్యాయి. నేరుగా న్యాయమూర్తి ముందు సాక్షుల చేత సీబీఐ ఇప్పించిన వాంగ్మూలాలు సైతం వారి ముందే నమోదైనట్లు వెలువడ్డాయి. ఈ రకమైన దర్యాప్తు కొనసాగించిన సీబీఐ.. విజయసాయిరెడ్డిని గత ఏడాది జనవరి 2న అరెస్టు చేసింది. 90 రోజుల్లో చార్జిషీటు వేయాలి కనుక మార్చి 31న చార్జిషీటు దాఖలు చేసింది.
చార్జిషీటుకు అర్థం మారింది...
చార్జిషీటంటే దర్యాప్తు పూర్తి చేసి ఇచ్చే తుది నివేదిక. తరవాత. కోర్టు దాన్ని చూసి విచారణకు స్వీకరిస్తుంది. ఆనక కోర్టులో విచారణ మొదలవుతుంది. కానీ ఈ కేసులో నిందితుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి కావటంతో అర్థాలన్నీ మారిపోయాయి. మొత్తం ప్రక్రియ తల్లకిందులయింది. ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న అంశాల్లోని కొన్నిటితో గత ఏడాది మార్చి 31న ఒక చార్జిషీటు దాఖలు చేసింది. అంతటితో తమ దర్యాప్తు పూర్తి అయిపోయినట్లు భావించవద్దని, మిగిలిన అంశాలపైనా తాము దర్యాప్తు చేయాల్సి ఉందని చెప్పింది. తరవాత ఆ ఎఫ్‌ఐఆర్‌లోని అంశాలను చించి ముక్కలు చేసి.. వాటిపై వరుసగా చార్జిషీట్లు వేస్తూనే ఉంది. వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి బెయిలును అడ్డుకుంటూనే ఉంది.
ఇప్పటికి ఐదు... ఇంకా వేస్తారట!!
బహుశా! భారతదేశంలో దర్యాప్తును ఇంతగా సాగదీస్తూ... ఇన్ని చార్జిషీట్లు వేసి... ఒక బెయిలును అడ్డుకోవటమనేది ఇంతవరకూ జరగలేదేమో!! వేసిన ఐదు చార్జిషీట్లలో కూడా ఒకదానికొకటి పొంతనలేని వాదనలే. ప్రభుత్వం నుంచి లబ్ధి పొందినందుకు ప్రతిఫలంగానే పెట్టుబడులు పెట్టారని కొన్ని చార్జిషీట్లలో వాదించిన సీబీఐ.. అసలు ఏ ప్రాజెక్టూ చేపట్టని వారి విషయంలో కొత్త వాదన తీసుకొచ్చింది. వై.ఎస్.జగన్, ఆడిటర్ విజయసాయిరెడ్డి కలిసి లాభాల ఆశ చూపించి ఇన్వెస్టర్లను మోసం చేశారని చెప్పింది. దీన్నేమనుకోవాలి? అసలు ముడుపులిస్తే వాటికి బదులుగా ఎక్కడైనా వాటాలిస్తారా? జగన్‌మోహన్‌రెడ్డి సంస్థలేవీ షెల్ కంపెనీలో, డమ్మీ కంపెనీలో కాదు కదా! వాటి ఆస్తులు కళ్లముందు కనిపిస్తున్నాయి. అవి రోజురోజుకూ ఎదుగుతున్నాయి. మరి వాటిలో వాటాలు తీసుకుని పెట్టుబడి పెడితే... ఆ పెట్టుబడులకు లాభాలు కూడా వస్తూ ఉంటే వాటిని క్విడ్ ప్రో కో అనటంలో ఏమైనా అర్థం ఉందా?
రూ. 16 కోట్ల లబ్ధికి 32 కోట్లు పెట్టుబడి పెడతారా?
సీబీఐ తన తొలి చార్జిషీట్లో ఏమని పేర్కొందంటే... ‘‘అరబిందో ఫార్మా, హెటెరో డ్రగ్స్‌లకు విశాఖ జిల్లా నక్కపల్లి సెజ్‌లోను, మహబూబ్‌నగర్ జిల్లా జడ్జర్ల సెజ్‌లోను ఏపీఐఐసీ భూములు కేటాయించింది. జడ్జర్ల సెజ్‌లో ఈ రెండిటికీ తలా 75 ఎకరాల చొప్పున 150 ఎకరాలు కేటాయించారు. ధరల్ని నిర్ణయించే కమిటీ ఎకరానికి రూ. 15 లక్షలు నిర్ణయించినా, ఎకరా రూ. 7 లక్షలకే ఇవ్వటం వల్ల ఖజానాకు రూ. 12 కోట్ల నష్టం వాటిల్లిందనేది సీబీఐ వాదన. ఇదికాక మెదక్ జిల్లా పాశమైలారంలో అరబిందో ఫార్మా తనకిచ్చిన భూమిలో కొంత తన అనుబంధ కంపెనీ అయిన ట్రైడెంట్ లైఫ్ సెన్సైస్‌కు బదలాయించింది. ట్రైడెంట్ గనక అరబిందో నుంచి తీసుకోకుండా నేరుగా ఏపీఐఐసీ నుంచి తీసుకుంటే... అప్పటి రేటు ప్రకారం తీసుకుని ఉండేది.. అలాకాకుండా అరబిందో నుంచి తీసుకోవటం వల్ల దానికి రూ. 4.30 కోట్లు లబ్ధి చేకూరింది. ఇలా మొత్తం రూ. 16.3 కోట్ల లబ్ధి చేకూరినందుకు ఈ రెండు సంస్థలూ కలిసి జగన్‌మోహన్‌రెడ్డి కంపెనీల్లో రూ. 32 కోట్లు పెట్టుబడి పెట్టాయి’’ అని సీబీఐ అభియోగం మోపింది.
* రూ. 16 కోట్లు లబ్ధి పొందినందుకు ప్రతిఫలంగా ఎవరైనా రూ. 32 కోట్లు పెట్టుబడి పెడతారా? పెట్టారంటే దానర్థం వారు లాభాల కోసమని కాదా?
* జడ్చర్ల సెజ్‌కు చంద్రబాబు హయాంలోనే భూములు సేకరించినా.. మూడేళ్ల పాటు అక్కడ పరిశ్రమ పెట్టటానికి ఎవరూ రాకపోవటాన్ని సీబీఐ ఎందుకు ప్రస్తావించలేదు?
* అభివృద్ధి చేసిన భూమిని ఎకరా రూ. 15 లక్షలకు కేటాయించాలని అనుకున్నపుడు.. ప్రహరీ, రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల్ని కల్పించుకునేవారికి తక్కువకు ఇవ్వరా?
* ఎకరాకు 15 లక్షలనేది అమ్మకం ధర. కానీ ఎకరా రూ. 7 లక్షల చొప్పున ఇచ్చింది లీజుకు. పైగా మొత్తం లీజు సొమ్మును ముందే చెల్లిస్తారు. గడువు తీరాక భూమి ఏపీఐఐసీకే ఉంటుంది. సీబీఐ దాన్నెందుకు ప్రస్తావించదు?
* ట్రైడెంట్ విషయం చూసినా... తన పేరెంట్ సంస్థకు భూమి ఉంటుండగా అక్కడే అది కొత్తగా
కొనుగోలు చేయాల్సిన అవసరమేముంది?
* అయినా ఇది జరిగేది ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ స్థాయిలో. దానికీ సీఎంకీ లింకు పెట్టటం ఎంతవరకు కరెక్టు?
ప్రాజెక్టు దక్కకుంటే మోసపోయినట్టా?
జయలక్ష్మి టెక్స్‌టైల్స్ ద్వారా టి.ఆర్.కన్నన్ రూ. 5 కోట్లు, మాధవ్ రామచంద్ర రూ. 19.65 కోట్లు, అరుణ్‌కుమార్ దండమూడి రూ. 10 కోట్లు జగతి పబ్లికేషన్స్‌లో పెట్టుబడి పెట్టారు. జగన్‌మోహన్‌రెడ్డి, ఆడిటర్ విజయసాయిరెడ్డి కలిసి తప్పుడు మాటలు చెప్పి, లాభాల ఆశ చూపించి మోసపూరితంగా వారిచేత పెట్టుబడులు పెట్టించారనేది సీబీఐ ప్రధాన ఆరోపణ.
* సీబీఐ విచారించాల్సింది క్విడ్ ప్రో కో పెట్టుబడుల్నా లేక ఇన్వెస్టర్లు మోసపోయారనే అంశాన్నా?
* ప్రాజెక్టులు చేపట్టిన ఇన్వెస్టర్లయితే క్విడ్ ప్రో కో అనటం.. ఏమీ చేపట్టని వారైతే మోసపోయారని చెప్పటం.. ఎంతవరకూ కరెక్టు?
* జగతిలో కానీ, భారతి సిమెంట్‌లో కానీ పెట్టుబడి పెట్టి తాము మోసపోయినట్లు ఏ ఇన్వెస్టరైనా ఫిర్యాదు చేశారా?
* కంపెనీల్లో ఇన్వెస్ట్‌మెంట్లు చేసినపుడు లాభనష్టాలు సహజమని సీబీఐకి తెలియదా? భారతి సిమెంట్‌లో ఇన్వెస్టర్లంతా లాభపడ్డారు కదా? దాన్నెందుకు పట్టించుకోరు?
* ‘సాక్షి’తో సమాన సర్క్యులేషన్ ఉన్న ‘ఈనాడు’ తన విలువను రూ. 7,150 కోట్లుగా అంచనా కట్టినపుడు సాక్షి దాన్లో సగం కూడా చెయ్యదా? ‘సాక్షి’ కొత్త సంస్థ. కానీ 35 ఏళ్లుగా నడుస్తున్న ‘ఈనాడు’... తన వద్ద 2,600 కోట్లు పెట్టుబడి పెట్టినవాళ్లకు ఒక్కపైసా అయినా డివిడెండ్ ఇచ్చిందా?
* 10 రూపాయల విలువైన సాక్షి షేరు రూ.350కి కేటాయిస్తే తప్పంటున్న వారికి... 100 రూపాయల విలువైన ‘ఈనాడు’ షేరు ఒకొక్కటి 5,28,630 రూపాయల చొప్పున కేటాయిస్తే తప్పనిపించటం లేదేం?
భూమినిచ్చిన బాబును వదిలేశారేం?
విశాఖపట్నంలోని ఫార్మాసిటీని డెవలప్ చేసింది రాంకీ ఇన్‌ఫ్రా సంస్థ. ఫార్మా సిటీ చుట్టూ వదలాల్సిన గ్రీన్‌బెల్ట్‌లో వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో మినహాయింపు ఇచ్చారని, అందుకే అది వివిధ సంస్థల ద్వారా జగతి పబ్లికేషన్స్‌లో రూ. 10 కోట్లు పెట్టుబడి పెట్టిందనేది సీబీఐ ప్రధాన ఆరోపణ.
ఇదీ... జరిగింది...
ఫార్మా క్లస్టర్ ఏర్పాటు చేయాలని 1999లో చంద్రబాబు ప్రభుత్వం భావించింది. 2001లో టెండర్లు పిలిచినా.. చివరికి రద్దు చేశారు. కానీ 2003 జూన్‌లో చంద్రబాబు ‘బిల్డ్ - ఓన్ - ఆపరేట్ - ట్రాన్స్‌ఫర్’ బదులు ‘బిల్డ్ - ఆపరేట్ - ఓన్’కు మార్చారు. అంటే నిర్మించిన సంస్థకే ప్రాజెక్టు సొంతమవుతుందన్న మాట. దీంతో 2003 జూలైలో రాంకీ సంస్థ ముందుకు రావటం, చంద్రబాబు ఓకే చేయటం.. ఎంఓయూ.. అన్నీ నాలుగు నెలల్లో జరిగిపోయాయి. 2004 మార్చి 12న ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉంటూనే చంద్రబాబు రాంకీతో రాయితీ ఒప్పందం కూడా చేసుకున్నారు. ఈ ఒప్పందంలోనే.. 352 ఎకరాల మేర గ్రీన్‌జోన్ ఉండాలని, దాన్లో గ్రీన్ బెల్ట్ ఏరియా 58.95 ఎకరాలు ఉండాలని నిర్దేశించారు. ముఖ్యమంత్రిగా వైఎస్సార్ బాధ్యతలు స్వీకరించాక ప్రాజెక్టలపై సమీక్షించేటపుడు ఫార్మాసిటీ అంశం చర్చకొచ్చింది. దాన్లో గ్రీన్‌జోన్‌పై పలు ప్రతిపాదనలు వచ్చాయి. నో డెవలప్‌మెంట్ జోన్‌గా ప్రకటించే గ్రీన్‌బెల్ట్ ఏరియా.. బౌండరీ చుట్టూ కిలోమీటరు మేర ఉంటే బాగుంటుందనుకున్నారు. ఆచరణ సాధ్యం కాదని ‘ఉడా’ చెప్పటంతో అటూఇటూ 250 మీటర్ల చొప్పున 500 మీటర్లకు పరిమితం చేద్దామనుకున్నారు. ఇలా చేయటం వల్ల తమది వెయ్యి ఎకరాల వరకూ పోతుందని ఫార్మాసిటీ యాజమాన్యం చెప్పటంతో గోడకు వెలుపల 250 మీటర్లు, గోడ లోపల మాత్రం 50 మీటర్లు ఉంటే చాలనుకున్నారు. చంద్రబాబు రాయితీ ఒప్పందంలో నిర్దేశించింది కూడా గోడ లోపల 50 మీటర్లే. పెంపుపై జరిగినవన్నీ సంప్రతింపులే తప్ప ఎక్కడా ఒక్క నిర్ణయం కూడా తీసుకోలేదు. ఒక్క జీవో కూడా విడుదల కాలేదు. ఇందులో తప్పేంటి?
* గ్రీన్‌బెల్ట్‌ను పెంచాలనుకుని, పెంచకుండా వదిలేసినందుకే ‘సాక్షి’లో రాంకీ రూ. 10 కోట్లు పెట్టుబడి పెట్టి ఉంటే.. 2,143 ఎకరాల్ని సింగిల్ టెండరుపై ఇచ్చేసిన బాబుకు ఎంత ముడుపులు ముట్టి ఉండాలి?
* పెంచాలనుకున్నపుడు.. బాబు హయాంలో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం 50 మీటర్లకే పరిమితం చేయాలని ముఖ్యమంత్రిని రాంకీ అడిగే అవకాశం లేదా? దానికి అంగీకరించి ఉంటే అదీ తప్పేనా?
* బల్క్ డ్రగ్ ఉత్పత్తిదారుల సంఘంలో (బీడీఎంఏ) సభ్యత్వం ఉన్న సంస్థలకు ఎకరా రూ. 15 లక్షల చొప్పున 450 ఎకరాలివ్వాలని వైఎస్సార్ షరతు పెట్టారు. అప్పటికే రాంకీ తన ప్లాట్లను ఎకరా రూ.కోటి చొప్పున విక్రయిస్తోంది. వైఎస్సార్ షరతు వల్ల రాంకీకి ఎకరాపై రూ. 85 లక్షల చొప్పున రూ.382 కోట్లు నష్టం వచ్చింది. మరి వైఎస్సార్ లబ్ధి చేకూర్చినట్లా?
వాన్‌పిక్‌పై ‘లెక్క’లేని వాదన...
ప్రకాశం జిల్లాలో వాన్‌పిక్ ప్రాజెక్టును అప్పగించినందుకు జగన్‌మోహన్‌రెడ్డికి చెందిన సంస్థల్లో నిమ్మగడ్డ ప్రసాద్ రూ. 850 కోట్లు పెట్టుబడి పెట్టారనేది సీబీఐ ఆరోపణ. నిజానికి ప్రకాశం జిల్లాలో పోర్టు, పోర్టు ఆధారిత పారిశ్రామిక కారిడార్‌ను ఏర్పాటు చేయాలనేది 1999-2000లో చంద్రబాబు హయాంలో వచ్చిన ప్రతిపాదనే. ఆంధ్రా సీపోర్ట్స్ సంస్థ ఈ ప్రతిపాదన చేసి విరమించుకుంది. తర్వాత చెక్ సంస్థ స్కోడా వచ్చి, ఎంఓయూ కుదిరి కూడా తీవ్ర జాప్యం చేయటంతో ఒప్పందం రద్దయింది. తరవాత రస్ అల్ ఖైమా వచ్చింది. జీ టూ జీ (గవర్నమెంట్ టు గవర్నమెంట్) ప్రాతిపదికన దాంతో ఎంఓయూ కుదిరాక.. తన స్థానిక భాగస్వామిగా నిమ్మగడ్డ ప్రసాద్‌కు చెందిన మ్యాట్రిక్స్ ఎన్‌పోర్ట్స్ సంస్థను అది చేర్చుకుంది. రెండు సీపోర్టులు, ఎయిర్‌పోర్టు, పోర్టు ఆధారిత పారిశ్రామిక కారిడార్ కోసం వాన్‌పిక్ 28 వేల ఎకరాలడిగింది. వైఎస్సార్ ప్రభుత్వం 18 వేల ఎకరాలు చాలని చెప్పింది. కానీ ఇప్పటిదాకా సేకరించింది 13 వేల ఎకరాలే. ఇందులో ప్రభుత్వ భూమి కేవలం 200 ఎకరాలు. మిగతావి అసైన్డ్, పట్టా భూములే. వీటిని ఎకరాకు రూ. 1.2 లక్షల నుంచి రూ. 5 లక్షల మధ్య వెచ్చించి వాన్‌పిక్ సంస్థే కొనుగోలు చేసుకుంది.
* ప్రసాద్ పెట్టిన పెట్టుబడుల్లో 80 శాతం వరకూ ..వాన్‌పిక్ ప్రాజెక్టుదక్కకముందో, వై.ఎస్.రాజశేఖరరెడ్డి మరణించాకో పెట్టినవే. వాటిని క్విడ్ ప్రో కో అంటారా?
* 11.3.2008న రాష్ట్ర ప్రభుత్వానికి - రస్ అల్ ఖైమా ప్రభుత్వానికి మధ్య ఒప్పందం కుదిరి ఎంఓయూపై సంతకాలు చేశారు. కానీ నిమ్మగడ్డ ప్రసాద్ పెట్టుబడులు మాత్రం 2006 డిసెంబర్‌లోనే మొదలయ్యాయి. అంటే 14 నెలల ముందే. ఇది క్విడ్ ప్రోకోనా?
* భారతి సిమెంట్‌లోనూ 2007లోనే రూ. 280 కోట్లు పెట్టుబడి పెట్టారాయన. 2010 ఏప్రిల్‌లో ఇతర ఇన్వెస్టర్లతో పాటు భారతిలో తన వాటాను ఫ్రాన్స్ కంపెనీ వికాకు విక్రయించినపుడు ఇతర ఇన్వెస్టర్లతో పాటు ఆయనకూ రూ. 267 కోట్ల మేర లాభం వచ్చింది. క్విడ్‌ప్రోకో పెట్టుబడులకు లాభాలొస్తాయా?
* 2008లో జగతి పబ్లికేషన్స్‌లో మరో రూ. 50 కోట్లు ఇన్వెస్ట్ చేసిన ప్రసాద్.. భారతి వాటా విక్రయంలో తనకు లాభం రావటంతో దానికి కొంత కలిపి 2010లో మరో రూ. 350 కోట్లు జగతి పబ్లికేషన్స్‌లో ఇన్వెస్ట్ చేశారు. అప్పటికి వైఎస్సార్ ముఖ్యమంత్రిగా కాదు కదా.. జీవించి కూడా లేరు. దీన్ని క్విడ్‌ప్రో కో అంటారా?
* 2010లో ప్రసాద్ పెట్టుబడి పెట్టేనాటికి ‘సాక్షి’ అగ్రశ్రేణి పత్రికగా ఆవిర్భవించింది. దేశంలోనే 8వ స్థానానికి చేరింది. ప్రసాద్‌కు మాత్రం జగతి షేర్లు 2006లో కొన్న ధరకే 2010లోనూ దక్కాయి. దీన్ని క్విడ్ ప్రో కో అంటారా?
* జగన్‌మోహన్‌రెడ్డి కంపెనీల్లో ప్రసాద్ నికరంగా పెట్టిన పెట్టుబడి రూ. 230 కోట్లే. ప్రతిగా ఆయనకు సాక్షిలో దాదాపు 18 శాతం వాటా ఉంది. జగతి పబ్లికేషన్స్‌ను కనక రూ. 1,300 కోట్ల కింద లెక్కించినా ప్రసాద్‌కు తన పెట్టుబడి రూపాయి నష్టం లేకుండా చేతికొస్తుంది. పోటీ పత్రిక ‘ఈనాడు’ ప్రకారమే విలువ కడితే ప్రసాద్‌కు పెట్టుబడిపై కనీసం నాలుగు రెట్ల లాభం వస్తుంది. దీన్ని క్విడ్ ప్రో కో అంటారా?
లీజిస్తే పెట్టుబడులొస్తాయా?
దాల్మియా సిమెంట్స్‌కు కడప జిల్లాలో సున్నపురాయి లీజుల్ని బదలాయించినందుకు అది భారతి సిమెంట్‌లో రూ.95 కోట్లు పెట్టుబడి పెట్టిందనేది 5వ చార్జిషీట్లో సీబీఐ చేసిన ప్రధానారోపణ. నిజానికి వైఎస్సార్ కడప జిల్లా పెద్దగా అభివృద్ధి చెందినదేమీ కాదు. అక్కడ వ్యవసాయం గిట్టుబాటూ కాదు. అలాంటిచోట లీజుపై సున్నపురాయి గనుల మైనింగ్‌కు అనుమతివ్వాలంటూ 1997లో చంద్రబాబు హయాంలో జయా మినరల్స్ దరఖాస్తు చేసుకుంది. అది అడిగిన భూమి పూర్తిగా ప్రైవేటుది. పెపైచ్చు వేరే దరఖాస్తులేవీ రాలేదు. దీంతో 2006లో జయా మినరల్స్‌కు 1,005 ఎకరాల సున్నపురాయి గనుల ప్రాస్పెక్టివ్ లెసైన్స్ మంజూరయింది. తర్వాత జయా సంస్థ ఆ లీజును తమ ప్రమోటర్లకే చెందిన ఈశ్వర్ సిమెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు బదలాయించాలని కోరింది. రుణం రావాలంటే లీజు ఆ కంపెనీ పేరిటే ఉండాలన్న ఉద్దేశంతో ఈ బదలాయింపునకు దరఖాస్తు చేయటం, అనుమతించటం రొటీన్‌గా జరిగాయి. తర్వాత నిధుల కోసం ఈశ్వర్ సిమెంట్స్ దాల్మియాకు షేర్లు విక్రయించటంతో పాటు ఆ సంస్థకు చెందిన వారిని డెరైక్టర్లుగానూ చేర్చుకుంది. అలా అది దాల్మియాకు అనుబంధ సంస్థగా మారింది. అనుబంధ సంస్థే కావటంతో లీజును దాల్మియాకు బదలాయించాలని కోరటం.. అనుమతించటం రొటీన్‌గా జరిగాయి. ఆ తరవాత ఈశ్వర్ సంస్థ దాల్మియాలో విలీనమైంది కూడా.
* సున్నపురాయి గనులనేవి సిమెంట్ కంపెనీలకు కాకుండా వేరే వాటికి పనికొస్తాయా? ఎప్పటికైనా వాటిని సిమెంట్ కంపెనీలకు ఇవ్వాల్సిందే కదా?
* ఏటా 100 వరకూ మైనింగ్ లీజుల బదలాయింపు ఉత్తర్వులు జారీ అవుతుంటాయి. వాటన్నిటినీ క్విడ్ ప్రో కో ఉత్తర్వులు అంటారా?
* మైనింగ్ లీజులు జారీ చేయటానికి ప్రత్యేక శాఖే ఉంది. అరుదైనవి తప్ప అన్నీ సీఎం టేబుల్ వద్దకు రావు. మరి వీటితో వైఎస్‌కు సంబంధం అంటగట్టటం ఏ మేరకు సమంజసం? నిజంగా వైఎస్ వాళ్లకు మేలు చేయాలనుకుంటే నేరుగా ప్రభుత్వ భూమిలో ఉన్న మైనింగ్ లీజులే ఇచ్చి ఉండేవారుగా?
* దాల్మియా సిమెంట్స్ దశల వారీగా భారతి సిమెంట్‌లో రూ 95 కోట్ల పెట్టుబడి పెట్టింది. షేరు ధర కూడా వివిధ దశల్లో దక్కింది. కానీ వికాకు వాటా విక్రయించాక 55 కోట్ల మేర లాభం వచ్చింది. క్విడ్ ప్రో కో అయి ఉంటే లాభాలొస్తాయా?
సీబీఐపై నమ్మకం పోతోంది...
ఒకప్పుడు పోలీసుల దర్యాప్తుపై నమ్మకం లేక ప్రతిపక్షాలు సీబీఐ విచారణకు డిమాండ్ చేసేవి. ఇప్పుడు ఆ సీబీఐపైనా నమ్మకం పోతోంది. ప్రతిపక్ష నేతలనే కాదు తనకు మద్దతునిస్తున్న మిత్రపక్షాల నేతలను బెదిరించడానికి యూపీఏ ప్రభుత్వం సీబీఐని ప్రయోగిస్తోంది. జగన్ కూడా కొత్త పార్టీ పెట్టడం, ఉప ఎన్నికలలో విజయం సాధించడం, కొంతమంది కాంగ్రెస్ నుంచి ఆయన పార్టీలో చేరుతుండటం వల్ల అధిష్టానం పెద్దల్లో తమ రాజకీయ భవితపై బెంగ మొదలైంది. దీంతో జగన్ కేసులను సీబీఐ ద్వారా సుదీర్ఘకాలం సాగదీయాలనేది కేంద్ర ప్రభుత్వం ఆలోచన కావొచ్చు.
- సురవరం సుధాకరరెడ్డి, సీపీఐ ప్రధాన కార్యదర్శి
సీబీఐ తీరు ఆశ్చర్యకరం...
జగన్ రెడ్డి కేసు విషయంలో సీబీఐ వ్యవహార శైలి ఆశ్చర్యం కలిగిస్తోంది. దిగువ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు ఒకే రకమైన వాదన వినిపిస్తోంది... ఆయన బయటకొస్తే సాక్ష్యాలు తారుమారు చేస్తారని... అయితే ఆయన ఎలా తారుమారు చేయగలరనేది మాత్రం చెప్పట్లేదు. మరి కోల్‌గేట్ కుంభకోణం విషయంలో సాక్షాత్తూ ప్రధానమంత్రి కార్యాలయానికే సంబంధం ఉందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆరోపణలు కాదు ఇక్కడ కుంభకోణం జరిగిందనేది వాస్తవం. మరి ఆ కేసులో ప్రధానమంత్రిని సీబీఐ ఎందుకు విచారించట్లేదు?
- ఎంజే అక్బర్, సీనియర్ పాత్రికేయులు
చార్జి 'చీటర్'... సీబీఐ! - ఎంజే అక్బర్, సీనియర్ పాత్రికేయులు
Reviewed by surya
on
12:24 AM
Rating:
No comments: