Comments

దొంగను వదిలిన దర్యాప్తు, ఏది నిజం?

కోల్‌గేట్, వాటర్‌గేట్‌లను మించిన సీబీఐ ఇన్వెస్టి ‘గేట్’


* ఎమ్మార్‌లో దర్యాప్తును ముందే నిర్ణయించుకున్న సీబీఐ
* మూలాల్ని విడిచిపెట్టి మూడు చార్జిషీట్లతో ముగింపు
* టెండరు నుంచే కుట్ర చేసిన బాబుకు పనిలోపనిగా క్లీన్‌చిట్
* ఆరోపణలొచ్చిన కాంగ్రెస్ పెద్దలకు కూడా మినహాయింపులు
* ప్రధాన కుట్రదారు తుమ్మల రంగారావుకు సైతం క్షమాభిక్ష
* తమకు కావాల్సినట్టు సునీల్‌రెడ్డి పేరు చెప్పినందుకు బహుమతి
* నోటిమాట తప్ప ఏ ఆధారాలూ చూపకపోయినా వదిలేసిన తీరు
*ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్‌కు 2000లోనే బీజం వేసిన చంద్రబాబు
* ఐటీసీ ప్రతిపాదనలకు నో; 2001లో కొత్త నోటిఫికేషన్ జారీ
* ప్రతిపాదించింది 250 ఎకరాలే; రాత్రికి రాత్రి 500కు పెంపు
* సీఎం పెంచమన్నారు.. పెంచండని చెప్పిన ముఖ్య కార్యదర్శి
* ఆర్టీఐ ద్వారా వచ్చిన నోట్‌ఫైళ్ల సాక్షిగా బయటపడ్డ వాస్తవాలు
* ప్రాజెక్టుపై ఐదు సంస్థల ఆసక్తి; రెండు తిరస్కరణ;
* చివరికి బరిలో ఎమ్మార్, ఐఓఐ, ఎల్ అండ్ టీ
* ఆఖరి క్షణంలో ఎమ్మార్ మినహా రెండూ వెనక్కి; ఎమ్మార్‌కు ఓకే
* ఐఓఐ ఇండియా సంస్థ బాబు సన్నిహితుడు చుక్కపల్లి సురేశ్‌ది
* దానికి జెమ్స్ అండ్ జ్యుయలరీ పార్క్ అప్పగింత
* ఎల్ అండ్ టీకి హైటెక్‌సిటీ సహా విలువైన ప్రాజెక్టులు
* ఎమ్మార్ తరఫున కోనేరు; అప్పటికే దుబాల్ ద్వారా లింకులు
* దీనికిచ్చిన 535 ఎకరాల పక్కనే భువనేశ్వరి భూమి
* ఎమ్మార్‌కు ఇవ్వటానికి మూడేళ్ల కిందటే ఎకరా కోటికి అమ్మిన బాబు
* ఎమ్మార్‌కు మాత్రం ఎకరా రూ. 29 లక్షలకే అప్పగింత
* బాబు కుట్రను స్పష్టం చేసిన విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్
* దీన్ని వదిలి 2005 తరవాతి విల్లా అమ్మకాలపైనే సీబీఐ దృష్టి
* కావాల్సిన వారిని ఇరికించి మూడు చార్జిషీట్లతో ముగింపు
* మొదట్లో రూ. 2,500 కోట్ల స్కామంటూ మీడియాకు లీకులు
* చివరికి జరిగిన నష్టం రూ. 215 కోట్లుగా తేలుస్తూ ముగింపు
* నిజానికి భూ విక్రయం ద్వారా బాబు కలిగించిన నష్టం రూ. 2,000 కోట్లపైనే
* దాన్ని పరిగణనలోకి తీసుకోకుండా దర్యాప్తును కానిచ్చిన వైనం
మూడేళ్లుగా కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ కలిసి సాగిస్తున్న కుట్రలో ఒక అంకానికి… మూడో చార్జిషీటు ద్వారా శనివారం సీబీఐ ముగింపు పలికింది. 2009 సెప్టెంబర్లో వై.ఎస్.రాజశేఖరరెడ్డి హెలికాప్టర్ దుర్ఘటనలో మరణించాక… వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి ధిక్కార స్వరం వినిపించాక… ఢిల్లీ వేదికగా ఊపిరి పోసుకున్న కుట్ర ఇది. వైఎస్ రాజశేఖరరెడ్డిని తీవ్రంగా వ్యతిరేకించి, అదే అర్హతగా మంత్రిపదవి సాధించిన డీఎల్ రవీంద్రా రెడ్డి, జేసీ దివాకర్‌రెడ్డి వంటి కాంగ్రెస్ నేతలు 2010 ఆగస్టులో తొలిసారి దీనిపై నోరు విప్పారు. సీబీఐ దర్యాప్తునకు డిమాండ్ చేశారు. తరవాత దానికి బొత్స వంటి కాంగ్రెస్ నేతలతో పాటు చిరంజీవి, చంద్రబాబు వంటి విపక్ష నేతలూ గొంతు కలిపారు.
తరవాత పరిణామాలు వేగంగా మారాయి. రోశయ్య హయాంలో రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం దీనిపై విచారణ మొదలుపెట్టింది. అంతలో… అంటే 2010 నవంబర్లో డీఎల్, జేసీల డిమాండ్‌ను లేఖ రూపంలో పెట్టి రాష్ట్ర హైకోర్టుకు ఎమ్మెల్యే పి.శంకర్రావు లేఖ రాశారు. ఎమ్మార్ వ్యవహారంలో రూ.2,500 కోట్ల మేర ప్రభుత్వం నష్టపోయిందని, దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని కోరారు. 2011 ఆగస్టులో హైకోర్టు దీనిపై దర్యాప్తునకు ఆదేశించాక… సీబీఐ అధికారికంగా రంగంలోకి దిగింది. దోషులుగా ఎవరిని తేల్చాలో, దర్యాప్తు ఎలా ఉండాలో అప్పటికే కాంగ్రెస్ నేతలు వివిధ రూపాల్లో చెప్పి ఉండటంతో… సీబీఐ ఆ మార్గాన్ని ఈజీగానే అనుసరించింది. అందుకే… అప్పటికప్పుడు తనకు ఆప్తమిత్రుడైపోయిన చంద్రబాబునుకనీసం విచారించే సాహసం కూడా చేయలేకపోయింది.
భూమి కట్టబెట్టిన దగ్గర్నుంచి, విల్లాల అమ్మకం కోసం కొలాబరేషన్ ఒప్పందానికి తెర తీయటం వరకూ… అడుగడుగునా చంద్రబాబు చేసిన కుట్ర స్పష్టంగా బయటపడినా సీబీఐ ఏ చార్జిషీట్లోనూ దీన్ని ప్రస్తావించనేలేదు. ఆఖరికి విజిలెన్స్ నివేదికలో కూడా దీన్ని వివరంగా పేర్కొన్నా… సీబీఐ ఇటు చూడనే లేదు. దర్యాప్తు సాగుతోందని, అనుబంధ చార్జిషీట్లు వేస్తామని ఇప్పటిదాకా చెబుతూ వచ్చినా… శనివారం మూడో చార్జిషీటును వేసి దర్యాప్తు పూర్తయినట్లు సంకేతాలిచ్చింది. మరి దీన్లో ‘ఏది నిజం?.’
అనుకూలం అనుకున్నవారిని వదిలేస్తూ… కావాల్సిన వారిని ఇరికిస్తూ… అలా ఇరికించేందుకు సహకరించిన ప్రధాన నిందితులకు కూడా క్షమాభిక్ష ప్రసాదిస్తూ దర్యాప్తు సాగించటమనేది బహుశా ఎక్కడా జరగదేమో!
ఎవరిని ఇరికించాలన్నది దర్యాప్తు మొదలు పెట్టడానికి ముందే నిర్ణయించేసుకుని… ఆ నిర్ణయాన్ని నిరూపించడానికి అవసరమైన అన్ని పిల్లిమొగ్గలూ వేయటమనేది ప్రపంచంలో ఏ దర్యాప్తు సంస్థా చేయదేమో!!
ఇక్కడ మాత్రం అదే జరిగింది. ఎమ్మార్ వ్యవహారంలో సీబీఐ సరిగ్గా అదే చేసింది. 13 నెలల పాటు రకరకాల పిల్లిమొగ్గలేస్తూ.. మీడియాకు లీకులిస్తూ సాగించిన దర్యాప్తులో.. భూములు కేటాయించిన సూత్రధారి చంద్రబాబునాయుడిని వదిలేసింది. ఎమ్మార్‌ను ఈ దేశానికి ఆహ్వానించి, పోటీ టెండర్లు లేకపోయినా దానికి 535 ఎకరాల్ని కుట్రపూరితంగా అప్పగించిన చంద్రబాబుకు పనిలో పనిగా క్లీన్‌చిట్ కూడా ఇచ్చేసింది. డబ్బులు చేతులు మారినట్టు ఆరోపణలొచ్చిన కాంగ్రెస్ పెద్దలనూ పక్కనబెట్టింది. ప్లాట్లు కొన్నవారిని తనకు కావాల్సినట్టు సాక్ష్యాలివ్వాలంటూ బెదిరించింది.
చదరపు గజం రూ.5 వేలకు విక్రయించేలా ఎమ్మార్‌తో ఒప్పందం చేసుకున్న స్టైలిష్ హోమ్స్ అధిపతి తుమ్మల రంగారావుకు ఏకంగా క్షమాభిక్షే ‘ప్రసాదించింది’. తాను కోరినట్టుగా ైవె ఎస్సార్ కుటుంబానికి సన్నిహితుడైన సునీల్ రెడ్డి పేరు చెప్పినందుకు ఆయనకు సీబీఐ ఇచ్చిన బహుమతది! అసలు ఇలాంటి దర్యాప్తు ప్రపంచంలో ఎక్కడైనా ఉంటుందా? నియంతలు అధికారంలో ఉన్నచోటైనా ఇలా జరుగుతుందా? దర్యాప్తు సంస్థ అంటే… తప్పు జరిగిందో లేదో విచారించి తేల్చే సంస్థ. కానీ తప్పు జరిగిందని ముందే ఒక నిర్ధారణకు వచ్చి, ఎవరెవరు దోషులో కూడా ముందే నిర్ణయానికొచ్చేసి… దాన్ని ధ్రువపరచుకునే ‘దిశ’గా దర్యాప్తు చేయడమనేది ఎక్కడైనా ఉందా? ఇలా చేయాలని సీబీఐకి ఎవరు చెప్పారు? అ ది దర్యాప్తు సంస్థేనా, రాజకీయ పార్టీల అనుబంధ సంఘమా?
నిజం చెప్పాలంటే ఎమ్మార్ వ్యవహారంలో ప్రధానాంశాలు మూడు. ఒకటి ఎమ్మార్‌కు ఈ ప్రాజెక్టును కట్టబెట్టిన తీరు. రెండు దీన్లో ఏపీఐఐసీ వాటా. మూడు ఏపీఐఐసీకి నష్టం వచ్చేలా కుదుర్చుకున్న కొలాబరేషన్ ఒప్పందం. మరి ఈ మూడింటికీ కారణమెవరు? ఎక్కడ తప్పు జరిగింది? నివేదిక సహితంగా విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు బయటపెట్టిన నిజాలివిగో…
బిడ్డింగ్ నుంచే దుర్మార్గం …
బిడ్డింగ్ ప్రక్రియలో నచ్చని సంస్థల్ని ఏరేసి… బినామీ సంస్థల్ని పక్కకు తప్పించి… చివరకు ఒకే ఒక్క సంస్థ మిగిలేలా చక్రం తిప్పటం. బాబు మార్కు కుట్ర ఇది.
దేశంలో ఎక్కడా లేనట్టుగా ఓ ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్‌ను నిర్మించాలనుకున్నారు 2000వ సంవత్సరంలో నాటి సీఎం చంద్రబాబు నాయుడు. టౌన్‌షిప్ అంటే జనం ఉండేదేమీ కాదు. 18 రంధ్రాల గోల్ఫ్ కోర్స్.. చుట్టూ శ్రీమంతుల విల్లాలు.. ఫైవ్‌స్టార్, బిజినెస్ హోటళ్లు.. అంతర్జాతీయ ప్రమాణాలతో సమావేశ మందిరం. ఇదీ టౌన్‌షిప్ స్వరూపం!
2000 మార్చిలో ఏపీఐఐసీ ప్రకటన ఇచ్చింది. కొన్ని సంస్థలు ముందుకొచ్చాయి. ఐటీసీ, ఈఐహెచ్ లిమిటెడ్‌లను షార్ట్ లిస్ట్ చేశారు. రెండిటికీ ఆర్‌ఎఫ్‌పీ (రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్) పత్రాలు పంపగా ఐటీసీ ఒక్కటే స్పందించింది. మణికొండ, హుస్సేన్‌సాగర్ రెండు చోట్లా భూములు కేటాయిస్తే ప్రాజెక్టును రెండు చోట్లా చేపడతామని పేర్కొంది. కానీ మణికొండ వద్ద మాత్రమే భూమి కేటాయిస్తామని చెప్పిన బాబు ప్రభుత్వం.. ఆ నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకుంది.
2001 జూలై 6న ఏపీఐఐసీ ద్వారా మరో నోటిఫికేషన్ ఇచ్చారు. దీనికి స్పందించి.. దుబాయ్‌కి చెందిన ఎమ్మార్, మలేసియాకు చెందిన ఐఓఐ ప్రాజెక్ట్స్, హాంకాంగ్‌కు చెందిన సోమ్ ఏసియా, ఎల్ అండ్ టీ, షాపూర్జీ పల్లోంజీ.. ఈ ఐదూ ముందుకొచ్చాయి. ఎందుకనో సోమ్ ఏసియాను, షాపూర్జీ పల్లోంజీని బాబు ప్రభుత్వం పక్కనపెట్టింది. మిగిలిన మూడింటినీ ఆర్‌ఎఫ్‌పీకి అర్హమైనవిగా సెప్టెంబర్ 26న ప్రకటించింది. టెండర్లకు ఆఖరుతేదీ 2001 డిసెంబరు 15 కాగా.. చిత్రంగా ఐఓఐ, ఎల్ అండ్ టీ వెనక్కెళ్లిపోయాయి. ఎమ్మార్ ఒక్కటే మిగిలింది. పోటీ లేకుండా సింగిల్ టెండరుంటే, దాన్ని రద్దు చేసి మళ్లీ పిలుస్తారు. కానీ బాబు ప్రభుత్వం మాత్రం అలా చేయలేదు. ఎమ్మార్‌కే ప్రాజెక్టును కట్టబెట్టేసింది.
ప్రభుత్వానికి చెందిన 445 ఎకరాలతో పాటు మరో 80 ఎకరాల్ని రైతుల నుంచి సేకరించి మరీ.. మొత్తం 535 ఎకరాలు కేటాయించేందుకు ఒప్పందం చేసుకుంది. అది కూడా కేవలం ఎకరా రూ.29 లక్షల చొప్పున! ఇక్కడ గమనించాల్సిన అంశం మరొకటుంది. ఎమ్మార్‌కు కేటాయించిన స్థలానికి సమీపంలోనే బాబు కుటుంబానికి మూడెకరాల స్థలముంది. ఎమ్మార్‌తో ఒప్పందానికి మూడేళ్ల ముందే దాన్ని బాబు ఎకరా రూ.కోటి చొప్పున రెడ్డీ ల్యాబ్స్‌కు విక్రయించారు. మరి సొంత స్థలాన్ని ఇలా మూడేళ్ల ముందే ఎకరా కోటి రూపాయలకు అమ్మిన బాబు.. ఎకరా విలువ రూ.4 కోట్లు పలుకుతున్న సమయంలో ప్రభుత్వ స్థలాన్ని కేవలం రూ.29 లక్షలకు ఎందుకిచ్చేశారు? అదీ సంపన్నుల విల్లాల కోసం!!
ఆ రెండూ బినామీ సంస్థలే…
వెనక్కెళ్లిపోయిన రెండింట్లో ఒకటి ఎల్ అండ్ టీ. రెండోది బాబు బినామీ చుక్కపల్లి సురేశ్‌ది.
ఇక్కడ మరొకటి కూడా గమనించాలి. చివరి నిమిషంలో టెండర్లు వేయకుండా వెనక్కెళ్లిపోయిన సంస్థలు రెండూ బాబుకు అత్యంత సన్నిహితమైనవి. ఎల్‌అండ్ టీని చూసుకుంటే రాష్ట్రంలో హైటెక్ సిటీ నుంచి కాకినాడ పోర్టు వరకూ బాబు కట్టబెట్టిన ప్రతి ప్రాజెక్టూ దానికే. టీడీపీ కార్యాలయమైన ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్‌ను అది ఉచితంగా నిర్మించిందన్న ఆరోపణలూ ఉన్నాయి. ఇక ఐఓఐ ప్రాజెక్ట్స్ (ఇండియా) చూసుకున్నా అది బాబు సన్నిహితుడు చుక్కపల్లి సురేశ్‌ది. బంజారాహిల్స్‌లో అత్యంత విలువైన ఐదెకరాల్ని జెమ్స్ అండ్ జ్యుయలరీ పార్క్ పేరిట ఆయనకు బాబు కారు చౌకగా కట్టబెట్టారు. పెపైచ్చు హైటెక్ సిటీ రెండో దశనూ సురేశ్‌కు చెందిన ఫీనిక్స్ ప్రాజెక్ట్స్‌కే అప్పగించారు. అదీ కథ.
250 నుంచి 535 ఎకరాలకు పెంపు…
ప్రతిపాదించింది 250 ఎకరాలే అయినా.. బాబు రాత్రికి రాత్రి తన కార్యదర్శితో చెప్పి దాన్ని రెట్టింపు చేశారు.
ఈ ప్రాజెక్టుపై చంద్రబాబు ఆసక్తి అంతా ఇంతా కాదు. 2001లో ఏపీఐఐసీ ప్రకటనలు జారీ చేసినపుడు కూడా మణికొండలోని 250 ఎకరాలనే ప్రతిపాదించారు. ఆ భూములపై నాటికి హైకోర్టు స్టే కూడా ఉంది. కానీ బాబు చొరవతో 2001 జులై 11న స్టే తొలగడం, ఆ మర్నాడే పత్రికల్లో ప్రకటనలు జారీ కావటం జరిగిపోయాయి.
నిబంధనల ప్రకారం ఆగస్టు 2, 3 తేదీల్లో ఈ ప్రకటనల్ని జతపరుస్తూ ప్రధాన కార్యదర్శికి, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శికి ఏపీఐఐసీ నోట్ ఫైళ్లు పంపింది. ఆ వెంటనే భూమిని 250 ఎకరాలు కాకుండా 500 ఎకరాలకు పెంచాలని ఏపీఐఐసీకి ఆదేశాలందాయి. నిబంధనల ప్రకారం వెళుతున్న అధికారులకు అనుమానం వచ్చింది. చీఫ్ సెక్రటరీని అడిగారు. దాంతో.. ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి తనకు పంపిన నోట్‌ను వాళ్లకు పంపారాయన. దాన్లో ఏముందంటే… ‘‘చీఫ్ సెక్రటరీ గారూ! ఈ విషయం పరిశీలించండి.
ఈ ఉదయం దీనిపై సీఎం నాతో మాట్లాడారు. మీరు తగిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నా’’ అని ఆ నోట్లో ఉంది. చేసేదేమీ లేక ఏపీఐఐసీ మరో సవరణ ప్రకటన జారీ చేసింది. దాన్లో భూమిని 535 ఎకరాలకు పెంచింది. అసలు భూమిని పెంచమని ఎవరడిగారు? టెండర్లు వేసిన సంస్థలు ఎక్కువ భూమి కావాలన్నాయా? ఏపీఐఐసీ ఏమైనా ప్రతిపాదించిందా? అలాంటిదేమీ లేనపుడు చంద్రబాబు ఎందుకంత ఆసక్తి చూపించారు? 500 ఎకరాలైతే ముడుపులు డబుల్ అవుతాయనా? దీన్ని సీబీఐ పట్టించుకోలేదెందుకు?
కోనేరు ప్రసాద్‌తో అప్పటికే లింకులు…
విశాఖలో బాక్సైట్ గనుల్ని కోనేరు తెచ్చిన దుబాల్ కంపెనీకి కట్టబెట్టడానికి బాబు ప్రయత్నించారు.
ఎమ్మార్‌లో కీలక సూత్రధారి కోనేరు రాజేంద్రప్రసాద్‌కు అప్పటికే బాబుతో సన్నిహిత బంధాలుండటాన్ని గమనించాలి. 2000లో దుబాయ్ అల్యూమినియం కంపెనీ (దుబాల్) పేరిట విశాఖలో బాక్సైట్ గనుల్ని ప్రసాద్‌కు కట్టబెట్టే ప్రయత్నం చేశారు బాబు. రస్ అల్ ఖైమాకు చెందిన రాక్ సిరామిక్స్‌ను సైతం కోనేరు ద్వారానే రాష్ట్రానికి రప్పించారాయన. పైగా బాబు దుబాయ్ వెళ్లినపుడల్లా కోనేరే ఆతిథ్యమిచ్చేవాని, అక్కడి బాబు ఆస్తుల్ని ఆయనే చక్కబెట్టేవారని పలు ఆరోపణలు వచ్చాయి కూడా. అలాంటి సంస్థకు ఐటీ హబ్ పక్కన 535 ఎకరాల్ని బాబు కట్టబెట్టినా.. సీబీఐకి అది దర్యాప్తు చేయదగ్గ అంశంగానే కనిపించకపోవటమే అసలైన చిత్రం.
ఏపీఐఐసీ వాటాకు ఆదిలోనే గండి!
15 ఎకరాలిచ్చిన హోటల్ కన్వెన్షన్ సెంటర్లో ఏపీఐఐసీకి 49 శాతం; 520 ఎకరాలిచ్చిన గోల్ఫ్‌కోర్సు విల్లాల్లో మాత్రం దానికి 26 శాతం! ఇదీ బాబు మహిమ!!
రైతుల నుంచి సేకరించి మరీ ఎమ్మార్‌కు 535 ఎకరాల భూమిని అప్పగించిన చంద్రబాబు.. వాటాల్లోనూ చేతివాటం చూపించారు. 535 ఎకరాల్లో.. హోటల్, కన్వెన్షన్ సెంటర్లకు 15, గోల్ఫ్‌కోర్సుకు 200, విల్లాలకు 285 ఎకరాలు కేటాయించారు. అయితే లాభాలు వస్తాయో, రావో.. వస్తే ఎప్పుడొస్తాయో కూడా తెలియని 15 ఎకరాల హోటల్, కన్వెన్షన్ సెంటర్లో ఏపీఐఐసీ వాటాను 49 శాతంగా ఉంచి.. లేఔట్లు వేసి, అమ్మగానే లాభాలొచ్చే గోల్ఫ్ కోర్స్, విల్లాల ప్రాజెక్టుకు 520 ఎకరాలిచ్చి కూడా.. వాటాను 26 శాతానికే పరిమితం చేశారు బాబు. ఇది చాలు.. బాబు కుట్ర ఏ స్థాయిదో బయటపెట్టడానికి!!
రియల్ ఎస్టేట్‌తో పాటు వివిధ అవసరాల కోసం వాడుకోవటానికి అనుమతించిన 285 ఎకరాల్లో ఏపీఐఐసీ వాటాను 26 శాతమే ఎందుకు ఉంచారన్నది బాబుకు తప్ప మరెవరికీ తెలియని రహస్యం! అప్పట్లో ఏ రియల్టీ ప్రాజెక్టు వచ్చినా బిల్డరు వాటా 40 శాతం, భూ యజమాని వాటా 60 శాతంగా ఉండేది. కానీ బాబు మాత్రం.. భూమినిస్తూ కూడా ప్రభుత్వానికి సగం కాదు కదా… కేవలం 26 శాతం వాటా మాత్రమే ఉంచుకున్నారు. ఈ లాభం చేకూర్చినందుకు ఎన్ని కోట్లు చేతులు మారాయన్నది బాబు చెబితే మాత్రమే బయటపడే రహస్యం.
కొలాబరేషన్‌తో కొల్లగొట్టిందీ బాబే..!
ఎన్నికల్లో ఓడిపోయినా ముడుపులు నేరుగా అందేలా 2003లోనే థర్డ్ పార్టీకి బాబు పచ్చజెండా ఊపారు.
భూమిని ఎమ్మార్‌కు కట్టబెట్టేశాక.. ప్రాజెక్టు పనులు ఊపందుకున్నాక.. 2003 ఆగస్టు 19న మరో ఒప్పందం తెరపైకి వచ్చింది. అదే కొలాబరేషన్ అగ్రిమెంట్. అభివృద్ధి, నిర్వహణ, ఇతర సహకారాల నిమిత్తం ప్రాజెక్టులో ఏ భాగాన్నయినా మూడో పక్షానికి అప్పగించేందుకు వీలు కల్పించే ఒప్పందమిది. దీనికి ఏపీఐఐసీ అంగీకారం ఉండాలి. కానీ… ‘‘ఏపీఐఐసీ గనక అడ్డుకోవాలనుకుంటే సహేతుకమైన కారణం చూపాలి’’ అనే క్లాజు పెట్టారు. సరిగ్గా ఈ క్లాజుతోనే ఏపీఐఐసీ చేతులు కట్టేశారు బాబు. ఎందుకంటే ఏపీఐఐసీ ఏదైనా నిర్ణయాన్ని అడ్డుకుని దానికి కారణం చూపించినా… అది సహేతుకం కాదని ప్రభుత్వమో, ఎమ్మారో కొట్టేస్తాయి. ఈ కొలాబరేషన్ ఒప్పందమే కుంభకోణానికి మూలమని 2011లో ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన విజిలెన్స్ నివేదిక స్పష్టంగా చెప్పింది కూడా!
2004లో ఎన్నికలుండటంతో… తాను అధికారంలో లేకున్నా కూడా ఎమ్మార్‌లో తన హవా సాగటానికి, ముడుపులు అందటానికి వీలుగా… థర్డ్‌పార్టీకి బాబు ఈ ఒప్పందం ద్వారా పచ్చజెండా ఊపారు. తన బినామీ కోనేరు ప్రసాద్‌ను రంగంలోకి దింపి ఆయన ద్వారా 2004 సెప్టెంబర్లో స్టైలిష్ హోమ్స్ రియల్‌ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్‌ను ఏర్పాటు చేయించారు. ఎమ్మార్ విల్లాలను అమ్ముకునే థర్డ్ పార్టీగా దాన్ని రంగంలోకి దించారు. కోనేరు ప్రసాద్ తన స్నేహితుడు తుమ్మల రంగారావుతో కలిసి బాబు నేర్పిన చాతుర్యం ప్రదర్శించారు. విల్లా స్థలాల్ని చదరపు గజం రూ.5 వేలకే అమ్మినట్లు చూపిస్తూ… ఆ మొత్తాన్ని ఎమ్మార్‌కు అధికారికంగా అందజేశారు. మిగతా సొమ్ము ఆయన, రంగారావు బ్లాక్‌లో తీసుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. అయితే తన సూచనల మేరకు విల్లాలు కొన్న కొందరు వ్యక్తులు ఆ సొమ్మును సునీల్‌రెడ్డికి ఇచ్చారని తుమ్మల రంగారావు సాక్ష్యమివ్వటంతో సునీల్‌ను అరెస్టు చేశారు. అప్రూవర్‌గా మారినందుకు రంగారావుకు బెయిలివ్వటమే కాక, నిందితుడిగా తొలగించి సాక్షిగా చేర్చింది సీబీఐ.
కుట్రదారును సీబీఐ వదిలేయొచ్చా?
సీబీఐ బరితెగింపు తనానికి పరాకాష్ట తుమ్మల రంగారావును సాక్షిగా మార్చుకోవటం. అసలు విల్లాల్ని గజం రూ.5 వేల చొప్పున విక్రయించి బ్లాక్‌మనీని అటూ ఇటూ తరలించారన్నది సీబీఐ దర్యాప్తులో ప్రధాన కోణం. మరి అలా చేసిన రంగారావును వదిలేసి… ఆయన సునీల్‌రెడ్డి పేరును చెప్పారన్న కారణంతో సునీల్‌ను అరెస్టు చేయటం ఏ రకం న్యాయం? తప్పు చేసిన వ్యక్తిని పట్టుకున్నపుడు తప్పించుకోవటానికి సవాలక్ష చెబుతాడు.
దానికి ఆధారాలు ఏమున్నాయో సీబీఐ అడగాలి కదా? మరి రంగారావు ఏ డాక్యుమెంట్లు చూపించారు? ఎలాంటి సాక్ష్యాలూ చూపకపోయినా ఆయన్ను వదిలి ఆయన చెప్పారన్న కారణంతో సునీల్‌ను అరెస్టు చేశారంటే ఏమనుకోవాలి? సీబీఐ ముందే ఒక నిర్ణయానికి వచ్చి ఈ దర్యాప్తు మొదలుపెట్టిందనటానికి ఇంతకన్నా ఏమైనా కావాలా? సునీల్ ఎవరో తనకు తెలియదని కోనేరు ప్రసాద్ చెప్పారు. బాబు హయాంలోనే ఈ ప్రాజెక్టును కట్టబెట్టారని కూడా చెప్పారు. మరి ఆ రెండిటినీ సీబీఐ ఎందుకు పట్టించుకోలేదు. తాను కావాలనుకున్నట్లు చెప్పలేదనా? మరీ ఇంత దివాలాకోరుతనమా?
దర్యాప్తు చేయకుండా వదిలేస్తారా?
ఎమ్మార్ కుంభకోణంలో చంద్రబాబు నాయుడి పాత్రపై దర్యాప్తు జోలికే పోలేదు సీబీఐ. ఆయన్ను పిలిపించటం గానీ, విచారించటం గానీ, 2005కు ముందటి డాక్యుమెంట్లు తీసుకుని పరిశీలించటం గానీ… ఏమీ చేయలేదు. ఎలా తెలుస్తోందంటే… ఇప్పటిదాకా దాఖలు చేసిన చార్జిషీట్లలో ఆ అంశాన్ని ప్రస్తావించనే లేదు కాబట్టి. మరి దర్యాప్తు చేయకుండా, ఆయన్ను ప్రశ్నించకుండా ఆయన హయాంలో అవకతవకలేవీ జరగలేదని సీబీఐ ఎలా నిర్ధారణకు వచ్చింది? ఇలా చెయ్యాలని దానికెవరు చెప్పారు?
చంద్రబాబుతో సీబీఐ ఇంత కుమ్మక్కు కావటానికి కారణాలేంటి? అసలు ఎమ్మార్ వ్యవహారంలో రెండు వేల కోట్ల కుంభకోణం జరిగిందని ఒకసారి, ప్రభుత్వానికి 1,600 కోట్ల నష్టం వాటిల్లిందని మరోసారి, వేల కోట్లు దోచుకున్నారని ఒకసారి తనకు అనుకూల మీడియాతో కథనాలు రాయించిన సీబీఐ… చివరకు మొత్తం వ్యవహారంలో ప్రభుత్వానికి జరిగిన నష్టం రూ.215 కోట్లే అని తేల్చిందెందుకు? తను ముందు చెప్పిన అంకెల్లో సున్నాలెందుకు జారిపోయాయి? దీన్నిబట్టి సీబీఐ ఎంత దురుద్దేశంతో వ్యవహరిస్తోందన్నది అర్థం కావటం లేదా? విల్లాలు కొన్నవారిని సైతం తాము చెప్పినట్లు చేయకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని బెదిరించటం నిజం కాదా? వారు కోర్టులో పిటిషన్లు సైతం వేశారు కదా? ఇదంతా సీబీఐ ఎవరికోసం చేసింది? బాబు కోసమా? బాసు కోసమా?
దొంగను వదిలిన దర్యాప్తు, ఏది నిజం? దొంగను వదిలిన దర్యాప్తు, ఏది నిజం? Reviewed by surya on 2:06 PM Rating: 5

No comments:

Powered by Blogger.