ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండడమే ఆయన చేసిన తప్పు అన్నట్టుగా జగన్‌పై కేసుల మీద కేసులు పెట్టారు. ఇళ్లు సోదాలు చేయించారు. అనుక్షణం వెంటపడ్డారు. అన్ని పార్టీలవాళ్లు కలిసి చేస్తున్న దాడి ఒకవైపు వారికి సపోర్టుగా విషం చిమ్ముతున్న కొన్ని పత్రికలు, కొన్ని చానెల్సు మరోవైపు. పాములు కూడా ఇంతగా పగపట్టవు.
ఈ రోజుకి మా మామగారు వైఎస్ రాజశేఖరరెడ్డిగారు మా మధ్య నుంచి వెళ్లిపోయి 3 సంవత్సరాల 13 రోజులైంది. జగన్‌ను జెయిల్‌లో పెట్టి 112 రోజులైంది. కాని ఈ మూడు సంవత్సరాలలో ముప్ఫయి ఏళ్లకు సరిపడా కష్టాలు చూసినట్టుగా ఉంది.
మా మామగారు రాష్ట్రానికి పెద్ద దిక్కు. నా పార్టీ నీ పార్టీ అని తేడా లేకుండా ప్రతి ఒక్కరి సమస్య తన సమస్యగా భావించి పరిష్కరించడానికి చూసేవారు. ప్రతి ఒక్కరి కంటి తడి తుడవడానికి చూసేవారు. ముఖ్యమంత్రిగా ఎంత బిజీగా ఉన్నా ఇంటి పెద్దగా ఒక్కరోజు కూడా బాధ్యతను విస్మరించేవారు కాదు. మాకు సలహాలు ఇచ్చేవారు. ప్రతి పనిలో సూచనలు చేసేవారు. చిన్నా పెద్దా అని లేదు. అందరికీ ఆలోచనలో సాయం చేసేవారు. ఏదైనా సమస్య వస్తే ఆయన ధైర్యం చెప్పినట్టుగా ఎవరూ చెప్పలేరు. అసలు ఆయన ఉండటమే పెద్ద ధైర్యం.
అలాంటి మనిషిని, మాకు కొండంత అండని, అంతపెద్ద ఆసరాని మా నుంచి అకస్మాత్తుగా దేవుడు తీసుకెళ్లాడు. మా కాళ్ల కింద నేల కదిలిపోయినట్టుగా అనిపించింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకూ సంతోషంగా ప్రశాంతంగా గడిచిన రోజు లేదు. ఈ కష్టంలో మేముంటే ఆదరించాల్సినవాళ్లే ఓదార్పు పలకాల్సినవాళ్లే పరాయివాళ్లయ్యారు. పగవారయ్యారు. మమ్మల్ని వేధించేవాళ్లయ్యారు. వాళ్లు మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టినా ఎన్ని సమస్యలు తెచ్చి పెట్టినా దేవుని దయవలన మా మామగారిని ప్రేమించిన ప్రజల అండ వలన జగన్ ముందుకు నడిచాడు. ప్రజలకు నేనున్నానన్న ధైర్యం ఇచ్చాడు. తన తండ్రిలానే వారిని గుండెలకు హత్తుకున్నాడు. ప్రజలూ వైఎస్‌ను అభిమానించినట్టే ఆయననూ అభిమానించారు. కాని దానిని వాళ్లు సహించలేకపోయారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండడమే ఆయన చేసిన తప్పు అన్నట్టుగా జగన్‌పై కేసుల మీద కేసులు పెట్టారు. ఇళ్లు సోదాలు చేయించారు. అనుక్షణం వెంటపడ్డారు. అన్ని పార్టీలవాళ్లు కలిసి చేస్తున్న దాడి ఒకవైపు, వారికి సపోర్టుగా విషం చిమ్ముతున్న కొన్ని పత్రికలు, కొన్ని చానెల్సు మరోవైపు. పాములు కూడా ఇంతగా పగపట్టవు. మధ్యలో గులాంనబీ గారు ఉపఎన్నికల ప్రచారంలో ‘మా పార్టీలో జగన్ ఉంటే కేంద్ర మంత్రిని చేసేవాళ్లం, ఆ తర్వాత ముఖ్యమంత్రిని కూడా చేసేవాళ్లం’ అని అనడం చూస్తే, వాళ్ల మాటలతో విభేదించడం వల్లే జగన్‌ను జైలుపాలు చేశారని తెలుస్తోంది. ఆ మాటలు గుర్తుకువచ్చినప్పుడల్లా తూటాల్లా తగిలి గుండెను పిండివేస్తున్నంత బాధ కలుగుతుంది.
కాని ఇన్ని చేసినా ఇంత వేధించినా జగన్ భయపడలేదు. నమ్మినదారి విడువలేదు. ఆ సమయంలో మాతో అనేవాడు- నాయనను ప్రేమించిన ప్రతి గుండె తోడుగా ఉన్నంతవరకూ, పై నుంచి నాయన, దేవుడు నన్ను చూసి ఆశీర్వదిస్తున్నంత వరకూ నాకే భయం లేదు- అని! నిజమే. ప్రజలతో నడుస్తున్న జగన్ ప్రజల కోసం నడుస్తున్న జగన్ ఎవరికి భయపడాలి? ఎందుకు భయపడాలి? ఇది వారికి నచ్చలేదనుకుంటా. అరెస్టు చేశారు. అలా చేస్తే అయినా జగన్ భయపడతాడేమోనని చూశారు. అలా జరగలేదు. జగన్ భయపడలేదు. చెదరలేదు. బెదరలేదు. కాబట్టి బెయిల్ రాకుండా చేయాలని ఇప్పుడు నానా తంటాలు పడుతున్నారు. నానా రాతలు రాస్తున్నారు. ఒకరోజు మేము లాయర్‌ని మార్చామని. ఒకరోజు సిబిఐ లాయర్‌ని మార్చిందని. ఏం చేసినా ఎవరు చేసినా తప్పే. ఏం చేయకపోయినా తప్పే. వీళ్ల పెన్నుల్లో ఉన్నది ఇంకు కాదు. బురద.
రాష్ట్రంలో నిత్యం ప్రజలు నానా కష్టాలు పడుతున్నారు. ఎన్నో సమస్యలతో అల్లాడుతున్నారు. అయినా సరే టిడిపికి ఇవన్నీ పట్టవు. దానికి జగనే లక్ష్యం. వాళ్లు గనక జగన్ మీద మాట్లాడినన్ని మాటలు ప్రజాసమస్యలపై మాట్లాడి ఉంటే కొద్దో గొప్పో విశ్వసనీయత వచ్చి ఉండేది. కాంగ్రెస్‌లో తమ అధికారం కాపాడుకోవడం కోసం జగన్ మీద మాట్లాడినన్ని మాటలు జనం కోసం మాట్లాడి ఉంటే వారి స్థానం పదిలంగా ఉండేదేమో.
మా మామగారు కూడా 32 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నారు. కాని ఏ రోజూ అవతలివాళ్లను దొంగదెబ్బ తీసి పైకి రావాలని అనుకోలేదు. ఆయన ఈరోజు ఉంటే ఇలా చేసేవారా? ఒక చంద్రబాబు కొడుకునో, ఒక కిరణ్‌కుమార్ కొడుకునో, ఒక బొత్స కొడుకునో, ఒక రామోజీ కొడుకునో లక్ష్యంగా చేసుకొని పీడించి ఉండేవారా అని ఆలోచిస్తే చేసేవారు కాదనే అనిపించింది. ఒక్కరిని చేసి చుట్టుముట్టి బాధ పెట్టి వికృత ఆనందం పొందే నీచత్వానికి దిగజారి ఉండేవారా? ముమ్మాటికి కాదు. ఆయనది అన్నం పెట్టిన చరిత్ర. చేయూతనిచ్చిన చరిత్ర. పగవారిని సైతం ప్రేమించిన చరిత్ర. అందుకే ఆయన చరిత్రకెక్కారు.
ఇవాళ మమ్మల్ని చుట్టుముట్టింది అందరూ పెద్దవాళ్లే. పెద్ద పెద్ద చదువులు చదువుకొని పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నవాళ్లే. కాని వారి కంటే ఏమీ చదువుకోని వాళ్లు ఏమీ లేని నిరుపేదలు తమ కుటుంబాలలో ఒకడిగా ఇవాళ జగన్‌ను అక్కున చేర్చుకున్నారు. మానవత్వం చూపారు. తండ్రిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న జగన్‌ను చూసి రాజకీయాలు తెలియని అవ్వలు, తాతలు, అక్కలు, చెల్లెళ్లు, అన్నలు, తమ్ముళ్లు నువ్వు ఒంటరివి కాదు మేమున్నామని చెప్పారు. 17 ఎమ్మెల్యే స్థానాల్లో, 2 ఎంపి స్థానాల్లో జగన్ అభ్యర్థులను జయజయధ్వానాలతో గెలిపించారు. ఇవాళ ఇండియా టుడే, ఎన్‌డిటివి వంటి విశ్వసనీయ సంస్థల సర్వేల్లో మేమంతా జగన్ పక్షమే అని ఎలుగెత్తి చాటారు. జరుగుతున్నది అన్యాయమని పెద్దలకు వినపడేలా చెప్పారు. ఇంతకంటే ఏం కావాలి?
జగన్‌కు నీచ రాజకీయాలు కుమ్మక్కు ఆలోచనలు తెలియదు. అందుకే అనుకుంటా ఆయనను అందరూ కలిసి ఒంటరిని చేశారు.
– వైఎస్ భారతి
w/oవైఎస్ జగన్
w/oవైఎస్ జగన్
ప్రశాంతంగా గడిచిన రోజు లేదు…జగన్ కోసం – – వైఎస్ భారతి w/o వైఎస్ జగన్
Reviewed by surya
on
1:42 PM
Rating:
No comments: