కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణంపై మరోసారి రాజకీయ కదలిక మొదలైంది. ప్రభుత్వం గనక సిద్ధమైతే తాను ఉక్కు ఫ్యాక్టరీని నిర్మిస్తానని మైనింగ్ వ్యాపారి, బీజేపీ నేత, కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి ఆదివారం మీడియా సమావేశంలో ప్రకటించారు
మరోవైపు టీడీపీ ఎంపీ సీఎం రమేశ్ కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కోసం నిరహార దీక్ష చేస్తున్నారు. అక్కడ ఫ్యాక్టరీల ఏర్పాటుకు అనుకూలత లేదని సెయిల్ నివేదిక ఇచ్చిందని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ఈ నేపథ్యంలో అసలు కడప ఉక్కు కథేంటి?
రాయలసీమ ప్రాంతంలోని కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుకు తొలి నుంచీ అడ్డంకులే ఎదురవుతున్నాయి.
నాటి బ్రాహ్మణి స్టీల్ నుంచి నేటి కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదిత ఉక్కు పరిశ్రమ వరకు ప్రతిసారీ ఒక అడుగు ముందుకు పడితే చాలా అడుగులు వెనక్కి పడుతున్నాయి.
ఇంతకీ కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు అడ్డుగా నిలుస్తున్నది ఏమిటీ? నివేదికలు చెబుతున్నట్టుగా ఇనుములో నాణ్యత లోపమా? స్థానికులు ఆరోపిస్తున్నట్టుగా రాజకీయ సంకల్ప లోపమా?
గాలి జనార్దన్ రెడ్డి ఏమంటున్నారు?
బెంగళూరులోని తన నివాసంలో గాలి జనార్దన్ రెడ్డి పత్రికా ప్రతినిధులతో మాట్లాడారు. తాము గతంలోనే కడపలో బ్రాహ్మణి స్టీల్స్ ఏర్పాటుకు అన్ని ఏర్పాట్లు చేశామని అన్నారు.
తమ కంపెనీకి అనుమతులు ఇస్తే రెండేళ్లలోనే ఉత్పత్తి ప్రారంభిస్తామని ఆయన తెలిపారు.
"బ్రాహ్మణి స్టీల్ ప్లాంటుపై ఇప్పటి వరకు రూ.1350 కోట్లు ఖర్చు చేశాం. వాటిని తిరిగి చెల్లిస్తే స్టీల్ ప్లాంట్ నిర్వహణను ప్రభుత్వానికి అప్పజెప్పడానికైనా సిద్దంగా ఉన్నాను'' అని గాలి పేర్కొన్నారు.
రాజశేఖరరెడ్డి హయాంలో ఏం జరిగింది?
కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలోనే బీజం పడింది.
గాలి జనార్దన్ రెడ్డికి చెందిన బ్రాహ్మణి స్టీల్స్‌తో 2007లో నాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకుంది.
ఒప్పందంలో భాగంగా ప్రభుత్వం కడప జిల్లాలోని జమ్మలమడుగు మండలం అంబవరం దగ్గర 8 వేల ఎకరాల భూమిని బ్రాహ్మణి స్టీల్స్‌కు కేటాయించింది.
గండికోట నుంచి 2 టీఎంసీ నీళ్లు ఇచ్చేందుకు, ముద్దనూరు నుంచి రైల్వే లైన్ ఏర్పాటుకు ప్రభుత్వం అంగీకరించింది.
రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి విద్యుత్ ఇవ్వడానికీ అన్ని ఏర్పాట్లు జరిగాయి.
కానీ, వైఎస్ ఆకస్మిక మరణం, ఆ తర్వాత అక్రమ మైనింగ్ కుంభకోణం కేసులో గాలి జనార్దన్ రెడ్డి జైలుపాలు కావడంతో బ్రాహ్మణి స్టీల్స్ పనులు మధ్యలోనే ఆగిపోయాయి.
దీంతో 2012లో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఒక జీవో ద్వారా బ్రాహ్మణ స్టీల్స్‌తో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకుంది.
2013లో జీవో 333 ద్వారా బ్రాహ్మణి స్టీల్స్‌కు ఇచ్చిన భూములను కూడా ప్రభుత్వం వెనక్కి తీసుకుంది.
దీంతో కడప జిల్లాలో బ్రాహ్మణి స్టీల్స్ పరిశ్రమ ఏర్పాటు మధ్యలోనే ఆగిపోయినట్లైంది.
వెనక్కి తగ్గిన 'భారత్ మైన్స్ అండ్ మినరల్స్'
కడప జిల్లా ద్విశతాబ్ది ఉత్సవాల సమయంలో (2012) భారత్ మైన్స్ అండ్ మినరల్స్(బీఎంఎం) సంస్థ జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు ముందుకు వచ్చింది.
దీనికి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆమోదం తెలిపింది. బీఎంఎం ప్రతినిధి బృందం జిల్లాలోని ఉక్కు ఉత్పత్తికి అనువైన ప్రాంతాలను పరిశీలించింది.
ప్రభుత్వ ఆదేశాలతో తాటిగొట్ల, కొప్పర్తి పంచాయతీల్లో బీఎంఎంకు కావాల్సిన భూమిని ఏపీఐఐసీ సేకరించింది.
6 వేల ఎకరాల భూములు ఇచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. కానీ, పరిశ్రమ ఏర్పాటు కార్యరూపం దాల్చకుండానే బీఎంఎం తన ప్రతిపాదనను వెనక్కి తీసుకుంది.
పరిశ్రమ ఏర్పాటు నుంచి ఎందుకు వెనక్కి తగ్గిందో కంపెనీ వివరణ కూడా ఇవ్వలేదు.
'పునర్విభజన చట్టం'తో మరోసారి
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014లో కేంద్ర ప్రభుత్వం కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు గురించి ప్రస్తావించింది.
'కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై పరిశీలన జరుపుతాం' అని పునర్విభజన చట్టంలోని 13వ షెడ్యూల్‌లో పేర్కొంది.
ఇందుకు అనుగుణంగా 2014 డిసెంబర్‌లో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ 'సెయిల్' జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై పరిశీలన జరిపింది. అక్కడ ప్లాంట్ ఏర్పాటు లాభదాయకత కాదని వెల్లడించింది.
2017లో కేంద్రప్రభుత్వం మరోసారి కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది.
కేంద్ర ఉక్కు శాఖ ఆధీనంలోని ప్రభుత్వ రంగం సంస్థ 'మేకాన్'ను ఇందులో భాగస్వామిని చేస్తూ పరిశీలన బాధ్యతలను కూడా అప్పజెప్పింది.
అయితే, పునర్విభజన చట్టంలో ప్రస్తావించి నాలుగేళ్లవుతున్నా ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై ఇంకా స్పష్టత రాలేదు.
కేంద్రం అఫిడవిట్‌తో మొదలైన రాజకీయాలు
ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ తెలంగాణ కాంగ్రెస్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి ఇటీవల సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై కేంద్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌లోనే కడప ఉక్కు కర్మాగారం ఏర్పాటుపై కూడా తమ వాదన వినిపించింది.
'ఏపీలోని వైఎస్సార్ కడప జిల్లా, తెలంగాణలోని బయ్యారంలో ఉక్కు పరిశ్రమల ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేస్తూ ఆరు నెలల్లో నివేదిక ఇవ్వాలని మాత్రమే చట్టంలో పేర్కొన్నామని, అయితే, అక్కడ ఫ్యాక్టరీల ఏర్పాటుకు అనుకూలత లేదని సెయిల్ నివేదిక ఇచ్చిందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. దీనికి సంబంధించి 2016లో టాస్క్‌ఫోర్స్ కమిటీ ఏర్పాటైందని కూడా తెలిపింది.
2017 డిసెంబర్ 12న ఈ కమిటీ చివరి సారిగా సమావేశమైందని, అధ్యయనం చేస్తున్న మెకాన్ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వాలు తగిన సమాచారం ఇవ్వాలని కమిటీ సూచించిందని వివరించింది.
కడపలో పరిశ్రమ ఏర్పాటు లాభదాయకం కాదని సెయిల్ పేర్కొన్నట్లు కేంద్రం తన నివేదికలో తెలపడంతో ఉక్కు పరిశ్రమపై మళ్లీ రాజకీయం మొదలైంది.
రాజకీయాస్త్రంగా మారిన ఉక్కు పరిశ్రమ
కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై రాష్ట్రంలోని రాజకీయ పార్టీలన్నీ ఒకదానిపై ఒకటి విమర్శలు చేసుకుంటున్నాయి.
'ప్యాకేజీ' అందనందుకే కడపలో ఉక్కు పరిశ్రమపై టీడీపీకి ప్రేమ పుట్టుకొచ్చిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తోంది.
ఆ పార్టీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి శైలజ చరణ్ రెడ్డి మాట్లాడుతూ, "గతంలో కడప ఉక్కు ఫ్యాక్టరీని అడ్డుకొన్న చంద్రబాబు ఈ రోజు దీక్షలు చేయించడం విడ్డురంగా ఉంది" అన్నారు.
జిల్లాకు చెందిన వైసీపీ నేతలు ఉక్కు సంకల్ప దీక్ష పేరుతో ఇప్పుడు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు.
మరోవైపు, కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటులో బీజేపీ నేత గాలి జనార్దన్ రెడ్డికి లబ్ధి చేకూర్చమే లక్ష్యంగా కేంద్రం పావులు కదుపుతోందని టీడీపీ నేత, పరిశ్రమల శాఖ మంత్రి ఎన్.అమరనాథ రెడ్డి ఆరోపించారు.
ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు అనుకూలత ఉందని ఓ పక్క బీజేపీ నాయకులే చెబుతుంటే, కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు కనిపించడం లేదని ఆయన ప్రశ్నించారు.
ఇక టీడీపీ ఎంపీ సీఎం రమేశ్ కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కోసం నిరహార దీక్ష మొదలుపెట్టారు.
'రాజకీయ కోణంలోనే ఆలోచిస్తున్నారు'
రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్ష పార్టీ అధినేతలు కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై చిత్తశుద్ది కనబర్చడం లేదని సీనియర్ పాత్రికేయుడు జింకా నాగరాజు అన్నారు.
'కడపలో ఉక్కు పరిశ్రమ డిమాండ్‌పై గళమెత్తితే మిగిలిన ప్రాంతాల వాళ్లకు దూరం కావాల్సి వస్తుందని జగన్.. తమకు పట్టులేని జిల్లాలో పరిశ్రమ ఏర్పాటు వల్ల రాజకీయంగా ఉపయోగం లేదని చంద్రబాబు భావిస్తుండవచ్చు' అని ఆయన విశ్లేషించారు.
కడపలో పరిశ్రమ ఏర్పాటు వల్ల లాభదాయకత లేదని 2016లోనే సెయిల్ పేర్కొందని, అప్పుడు స్పందించని టీడీపీ ఇప్పుడు బీజేపీతో బంధం తెగిన తర్వాతే ఉక్కు పరిశ్రమపై మాట్లాడుతోందని అన్నారు.
అన్ని పార్టీలు ఉక్కు పరిశ్రమ ఏర్పాటును రాజకీయకోణంలోనే చూస్తున్నాయన్నారు.
సెయిల్ ఏమంటోందంటే..
కడప జిల్లాల్లో నాణ్యమైన ముడి ఖనిజం లేదని సెయిల్ తన నివేదికలో పేర్కొంది. ముడి ఇనుములో ఉక్కు తక్కువగా ఉందని తెలిపింది. ఇనుప ఖనిజం శాతం 50, 54 మధ్యే ఉందని పేర్కొంది. మొత్తంగా అక్కడ పరిశ్రమ ఏర్పాటు లాభదాయకం కాదని కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో తెలిపింది.
తర్వాత మరో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ మేకాన్ జమ్మలమడుగులోని మైలవరం మండలం జంబాల దిన్నెలో స్థలాన్ని పరిశీలించింది.
ఇక్కడ 5000 వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. రవాణాకు జమ్మలమడుగు నుంచి రైల్వే ట్రాక్‌ను నిర్మించవచ్చు. గండికోట ప్రాజెక్టు నుంచి నీటిసరఫరా చేయోచ్చు. ఆర్టీపీపీ (రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు) నుంచి విద్యుత్ సరఫరాకు వీలవుతుంది.
అందువల్లే మేకాన్ ఈ ప్రాంతంలో ఖనిజ నిల్వలు, వాటి నాణ్యతపై మరోసారి పరిశీలన జరిపింది. అయితే, దీని నివేదిక ఇంకా అందలేదు.
ఎన్‌ఎండీసీ రిపోర్టులో ఏం ఉందంటే...
రాయలసీమ పరిధిలో దాదాపు 260 మిలియన్ టన్నులు, ఒక్క కడప జిల్లాలోనే 50 మిలియన్ టన్నుల ఇనుప ఖనిజం ఉన్నట్లు ఎన్ఎండీసీ, ఏపీ ఎన్ఎండీసీ గతంలోనే పలు నివేదికల్లో పేర్కొన్నాయి.
ఉక్కు తయారీలో ఉపయోగించే మరో ముఖ్య ఖనిజం సున్నపురాయి కడప జిల్లాలో 1700 మిలియన్ టన్నులు లభ్యమవుతుందని తెలిపింది.
లాభమా, ఉపాధి కల్పనా? ఏది ముఖ్యం?
లాభదాయకత లేకుంటే పరిశ్రమలు ఏర్పాటు చేయొద్దనే వాదన సరికాదని, ఉపాధి కల్పించే లక్ష్యంతో వెనకబడిన ప్రాంతాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేయాలని సామాజిక కార్యకర్తలు అంటున్నారు.
''విశాఖపట్నంలో ఇనుము లభ్యతే లేదు. 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న బైలదిల్లా గనుల నుంచి ఇనుము తీసుకొచ్చి విశాఖలో ఉక్కు ఉత్పత్తి చేస్తున్నారు. కడపకు 227 కిలోమీటర్ల దూరంలో ఓబుళాపురంలోనూ విస్తారమైన ఇనుప ఖనిజం ఉంది కదా.. విశాఖ మాదిరిగా కడపలో ఎందుకు చేయరు?'' అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ప్రశ్నించారు.
కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై తమ పార్టీ మొదటి నుంచి పోరాడుతోందని ఆయన బీబీసీకి తెలిపారు.
జిల్లాలో పరిశ్రమ ఏర్పాటు వల్ల 30 వేల మందికి ప్రత్యక్షంగా, 70 వేల మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు వస్తాయన్నారు.
స్టీలు ప్లాంట్ ఏర్పాటుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయం చేస్తున్నాయి. కాబట్టి దీనిపై రాజకీయంగానే గట్టి నిర్ణయం తీసుకోవాలని అన్నారు.
'50 ఏళ్ల కిందట విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ ఉద్యమాలు సాగాయి. కానీ, కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై ఆ స్థాయి ఉద్యమం జరగడం లేద'ని మానవ హక్కుల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జయశ్రీ బీబీసీతో అన్నారు.
రాయలసీమ సమస్యలను రాష్ట్ర సమస్యలుగా నేతలు చూడక పోవడం వల్లే ఇలాంటి పరిస్థితి తలెత్తిందని ఆమె ఆరోపించారు.
'లేనిది సంకల్పమే'
''అన్ని పార్టీలు ఉక్కు ఫ్యాక్టరీకి అనుకూలమే అంటున్నాయి. కానీ, ఇప్పటి వరకు పరిశ్రమ ఏర్పాటుపై ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. దీనికి ప్రధాన కారణం రాజకీయ నాయకులే. ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలనే సంకల్పమే వాళ్లకు లేదు'అని ఉక్కు సాధన ఐక్య వేదిక నేత ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు.
రాజకీయాలకు అతీతంగా ఉక్కు పరిశ్రమ కోసం తాము పోరాడుతున్నామని ఆయన బీబీసీకి తెలిపారు.
ఇక్కడ పరిశ్రమ ఏర్పాటు వల్ల లాభదాయకత లేదనీ, ఇక్కడ నాణ్యమైన ఇనుప ఖనిజం లేదని సెయిల్ పేర్కొనడం సరికాదన్నారు.
కడపలో నాణ్యమైన ఇనుప ఖనిజం లేకుంటే గాలి జనార్దన్ రెడ్డి బ్రాహ్మణి స్టీల్స్ స్థాపించడానికి ఎందుకు ముందుకు వస్తారని ఆయన ప్రశ్నించారు.
‘కడప ఉక్కు ఆంధ్రుల హక్కు’
Reviewed by surya
on
11:48 PM
Rating:
No comments: