3 జనవరి 2025:- అనకాపల్లి జిల్లా కె.కోటపాడు మండలంలోని మేడిచర్లకు చెందిన రైతు రొంగలి కోటేశ్వరరావు (44) వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వ్యవసాయానికి పెట్టిన పెట్టుబడి రాకపోవడంతో పాటు ఇతర ఆర్థిక సమస్యలు తలెత్తడంతో డిసెంబరు నెల 28వ తేదీన తన పొలంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు, ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స చేయించారు. చికిత్స పొందుతున్న కోటేశ్వరరావు జనవరి నెల 3వ తేదీ రాత్రి పరిస్థితి విషమించి మృతి చెందారు.
22 జనవరి 2025:- పల్నాడు జిల్లా పెదకూరపాడుకు చెందిన డి.సురేష్ (37) తనకున్న ఎకరం పొలంతోపాటు మరో ఎనిమిది ఎకరాలను కౌలుకు తీసుకుని పత్తి, మిర్చి సాగు చేశారు, సాగులో నష్టాలు వస్తుండడంతో అప్పులపాలయ్యారు. దీంతో తనకున్న ఎకరం పొలం అమ్మి కొంత అప్పు తీర్చారు. అయినా అప్పుల నుండి బయటపడలేక తీవ్ర మనస్థాపానికి గురై తాను సాగు చేస్తున్న పొలంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు.
26 జనవరి 2025:- కర్నూల్ , జూపాడుబంగ్లా మండలంలోని తంగడంచ గ్రామంలో కౌలు రైతు మస్తాన్ అలియాస్ మనోహర్ ఐదు ఎకరాలు పొలం కౌలుకు తీసుకొని పంటలు సాగు చేసేవాడు. పంటల సాగు చేసేందుకు పెట్టుబడులకు 8 లక్షల దాకా అప్పు చేశాడు. పంటలు చేతికిందగా నష్టం రావడంతో అప్పులు తీర్చేదారిలేక మనోవేదనకు గురైన మస్తాన్ అలియాస్ మనోహర్ పొలం దగ్గరకు వెళ్లి పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నారు.
28 జనవరి 2025:- ఏలూరు జిల్లా లింగపాలెం మండలం అయ్యప్పరాజగూడెం గ్రామానికి చెందిన బొల్లవరపు ప్రకాష్ బాబు(50). వ్యవసాయం చేసేందుకు అనేక అప్పులు చేసి పంటలో నష్టం రావడంతో అప్పులు అవి తీర్చే మార్గం కానరాక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు.
28 జనవరి 2025:- పచ్చమ గోదావరి జిల్లా అత్తిలి మండలం ఉనికిలి గ్రామానికి చెందిన చల్లాది ఈశ్వరరావు (43) గత కొంతకాలంగా కంచుమర్రు గ్రామంలో నివసిస్తూ కౌలుకు వ్యవసాయం చేస్తున్నాడు. వ్యవసాయంలో నష్టం రావడంతో ఆర్ధిక ఇబ్బందులు తాళలేక పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
1 ఫిబ్రవరీ 2025:- అనంతపురం జిల్లా , నార్పల మండల పరిధిలోని వెంకటాంపల్లి గ్రామానికి చెందిన యువ రైతు నాగప్రసాద్(32) పురుగు మందు తాగి ఆత్మ హత్యకు పాల్పడ్డాడు. తనకున్న 6 ఎకరాల పొలంలో వేరుసెనగ, కంది, తదితర పంటలు సాగుచేసేవాడు. అందుకు దాదాపు 10 లక్షలకుపైగా అప్పులు చేశాడు. వాటిని ఎలా తీర్చాలని మదనపడేవాడు. ఈ నేపధ్యంలోనే పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
5 ఫిబ్రవరీ 2025:- కర్నూలు జిల్లా గూడూరుకు చెందిన రైతు నాగరాజు (41) ఐదెకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని వివిధ పంటలు సాగు చేసేవాడు. వ్యవసాయం కలిసి రాక నష్టాలు రావడంతో పంటల పెట్టుబడికి తెచ్చిన అప్పులు భారీగా పెరిగిపోయాయి. ఓ వైపు కుటుంబ అవసరాలు, మరోవైపు పంటల పెట్టుబడులకు తెచ్చిన అప్పులు సుమారు 5 లక్షలకు పైనే చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో అప్పులు తీర్చే మార్గం కానరాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై నిరుపయోగంలో ఉన్న ఓ గోదాములో నాగరాజు ఉరేసు కుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
11 ఫిబ్రవరీ 2025:- చిత్తూరు జిల్లా పిచ్చాటూరు మండలంలోని ముడియూరు పంచాయతీ లక్ష్మీవిలాసపురం గ్రామానికి చెందిన వై. చిట్టిబాబు (50) అనే రైతు తుపాను కారణంగా పంటల నష్టం జరగడంతో పాటు పంటల పెట్టుబడి కోసం చేసిన అప్పులు తలకు మించిన భారం కావడంతో జీవితంపై విరక్తి చెంది తన వ్యవసాయ పొలంలో పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నారు.
12 ఫిబ్రవరీ 2025:- అనంతపురం జిల్లా, కణేకల్లు మండలం గంగలాపురం గ్రామానికి చెందిన రైతు హరిజన రాజు(35) తన నాన్న కపలప్ప గారి మారెప్ప పేరున ఉన్న అర ఎకరా ఆయకట్టు భూమిని సాగు చేస్తూ మరో ఆరున్నర ఎకరాల భూమిని కౌలుకు తీసుకున్నాడు. పంటల సాగు కోసం 8 లక్షల వరకు ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల వద్ద అప్పు చేశాడు. ఖరీఫ్‌లో సాగు చేసిన వరి పంటలో ఆశించిన మేర దిగుబడి రాలేదు. దీనికి తోడు మార్కెట్లో గిట్టుబాటు ధర లేక పోవడంతో తక్కువ ధరకే వరి ధాన్యాన్ని అమ్ముకోవాల్సి వచ్చింది. ఇటీవల తమ అప్పు తీర్చాలంటూ తరచూ వడ్డీ వ్యాపారులు గొడవ పడుతుండడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైన రాజు పంటకు నీరు పెట్టేందుకు వెళ్లి చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.

15 ఫిబ్రవరీ 2025:- అనంతపురం జిల్లా, తనకల్లు మండలంలోని బొంతలపల్లి పంచాయతీ పూలకుంటపల్లికి చెందిన వేమల ఈశ్వరప్ప పెద్ద కుమారుడు చంద్రశేఖర్ (33) తండ్రి పేరుతో ఉన్న 5 ఎకరాల్లో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించేవాడు. ఆరునెలల క్రితం 13 లక్షల విలువగల ట్రాక్టరుకు 2.50 లక్షలు నగదు చెల్లించి వాయిదాల పద్ధతిలో తీసుకొగా కర్బూజ, టమాట పంటల సాగుకు మరో 7 లక్షలు ఖర్చు చేశారు పంటలు గిట్టుబాటు కాక అప్పులు భారమవడంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
15 ఫిబ్రవరీ 2025:- గుంటూరు జిల్లా కాకుమాను మండలం గార్లపాడుకు చెందిన పఠాన్ ఖాదర్ బాషా(50) ఐదె కరాలను కౌలుకు తీసుకుని పొగాకు సాగు చేస్తున్నారు. సాగు నిమిత్తం గ్రామంలో అందిన కాడికి అప్పులు తెచ్చారు. ప్రస్తుతం ఈ ఏడాది పొగాకు ఆశించిన స్థాయిలో ధర లేకపోవడం, పంట సరిగా పండకపోవడంతో.. సాగుకు చేసిన 5 లక్షల అప్పు ఎలా తీర్చాలో తెలియక పంట పొలం వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు.
15 ఫిబ్రవరీ 2025:- గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం వంగిపురం గ్రామానికి చెందిన వరగాని బాబురావు (59) తనకున్న 40 సెంట్ల పొలంతోపాటు మరో మూడెకరాలను కౌలుకు తీసుకుని మూడేళ్లుగా పత్తి, మిర్చి సాగు చేస్తున్నారు. ఇందుకోసం అప్పులు చేశారు. పంటలు పండినా ఆదాయం సరిగా రాకపోవడంతో అప్పులు తీర్చడం కష్టమైంది. రుణ దాతల నుంచి ఒత్తిళ్ల నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. దీంతో తన పొలం వద్దకెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు.
16 ఫిబ్రవరీ 2025:- గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం కండ్రిక గ్రామానికి చెందిన తుపాకుల లింగయ్య (41) పదేళ్లకు పైగా కౌలు వ్యవసాయం చేస్తున్నారు. ఈ క్రమంలో మండలంలోని వేమవరంలో కౌలుకు పొలం తీసుకుని మూడెకరాల్లో మిర్చి, నాలుగెకరాల్లో పత్తి, ఎకరంలో వరి సాగు చేపట్టాడు. బొబ్బర తెగులు సోకి మిర్చి పంట దిగుబడి పూర్తిగా పడిపోయింది. గతేడాది జులై, ఆగస్టు నెలల్లో వర్షాల కారణంగా పత్తి దెబ్బతింది. పెట్టుబడి కోసం చేసిన అప్పులు పేరుకుపోయాయి. 15 లక్షలకుపైగా ఉన్న అప్పులు తీర్చే మార్గమే లేక తాను సాగుచేస్తున్న పొలం వద్దకెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు.
20 ఫిబ్రవరీ 2025:- గుంటూరు జిల్లా చమళ్ళమూడి గ్రామానికి చెందిన షేక్ మొగల్ సాహెబ్ (45) గత నాలుగేళ్ల నుండి గ్రామానికి చెందిన ఓ రైతు వద్ద ఎకరం.75 సెంట్లు మెట్ట భూమిని కౌలుకు తీసుకొని మిర్చి పంటను సాగు చేస్తున్నాడు. వర్షాలు సకాలంలో కురవకపోవడం, మిర్చికి తెగుళ్లు రావడంతో ఈ ఏడు దిగుబడులు గణనీయంగా తగ్గాయి. ఈ క్రమంలో భూ యజమానికి కౌలు చెల్లించే పరిస్థితి లేకపోవడం, చేసిన అప్పులు తీరేమార్గం కనిపించకపోవడంతో తను కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్న భూమిలోనే గడ్డిమందు సేవించి ఆత్మహత్య చేసుకున్నారు.
23 ఫిబ్రవరీ 2025:- ఎన్టీఆర్ జిల్లా ఏ.కొండూరు మండలం రామచంద్రాపురం గ్రామపంచాయతీ శివారు లక్ష్మీపురం గ్రామానికి చెందిన కొండెబోయిన రాంబాబు (45) వ్యవసాయం నిమిత్తం కొంత మేర అప్పులు చేశారు, ఆ అప్పులు అధికమవ్వడంతో రాంబాబు నాలుగు రోజులుగా ఇంటికి రాకుండా వెళ్లిపోవడంతో కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి చుట్టుపక్కల ప్రాంతాల్లో, గ్రామాల్లో వెతికే సరికి లక్ష్మీపురం గ్రామంలో మామిడి తోటలో చెట్టుకు ఉరి పెట్టుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు గుర్తించారు.
24 ఫిబ్రవరీ 2025:- శ్రీకాకుళం జిల్లా గార మండలం కొర్ని గ్రామానికి చెందిన రైతు వజ్జ రమణమూర్తి (37) చెట్టుకు ఉరేసుకుని బలవన్మరణా నికి పాల్పడ్డాడు. రమణమూర్తి వ్యవసాయం నిమిత్తం అప్పులు చేసాడు. ఆ అప్పులు భారం మోయలేకే ఆత్మహత్య చేసుకున్నారు.
26 ఫిబ్రవరీ 2025:- గుంటూరు రూరల్ మండలం చౌడవరంకు చెందిన రైతు కొండా శ్రీనివాసరావు(56) పొలం కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నారు. మొత్తం పది ఎకరాలు కౌలుకు తీసుకుని అయిదు ఎకరాల్లో పత్తి, మిర్చి, మరో 5 ఎకరాల్లో వరి పండిస్తున్నారు. దీనికి పెట్టుబడులు ఎక్కువ కావడంతో 12 లక్షల వరకు అప్పులు చేయాల్సి వచ్చింది. ఓ వైపు పంట సక్రమంగా పండకపోవడం, మరోవైపు అప్పులు ఇచ్చిన వారి నుంచి ఒత్తిళ్లు అధికం కావడంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఎలుకల మందు అన్నంలో కలిపి తిని ఆత్మహత్య చేసుకున్నారు.
27 ఫిబ్రవరీ 2025:- కర్నూల్ జిల్లా కోసిగి మండలం పరిధిలోని జమ్మలదిన్నె గ్రామానికి చెందిన బెందుల తిక్కయ్య (50) అనే రైతు అప్పుల బాధను భరించలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
28 ఫిబ్రవరీ 2025:- ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం చందర్లపాడు మండలంలోని, కోనయపాలెం గ్రామానికి చెందిన వినుకొల్లు నరసింహారావు (41) అనే కౌలురైతు పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. 2.5 ఎకరాల పొలంను కౌలుకు తీసుకొని మిరప పంట సాగు చేశారు. పంటలు సక్రమంగా పండక పెట్టుబడి కోసం చేసిన అప్పులు పెరిగిపోవడంతో అప్పుల వాళ్ళ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారు.
1 మార్చ్ 2025:- పల్నాడు జిల్లా కారంపూడి పట్టణంలో పెనుగొండ్ల బ్రహ్మయ్య కొంతకాలంగా 3 ఎకరాల పొలం కౌలు చేసుకుంటూ ఊరిలోనే ఓ చిన్న మెకానిక్ షెడ్డు పెట్టుకొని జీవనం సాగిస్తూ ఉన్నాడు. అప్పుల బాధ బరాయించలేక ఆత్మహత్య చేసుకున్నాడు.
1 మార్చ్ 2025:- అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం చిత్రబేడు గ్రామానికి చెందిన రైతు గిత్తా రామమోహన్ (29) తన తండ్రితో కలిసి 5 ఎకరాల్లో వేరుశనగతో పాటు ఇతర పంటలను సాగు చేసేవారు. ఇందుకు గాను 6 లక్షలు అప్పులు చేశారు. పంటలు చేతికందకపోవడంతో అప్పులకు వడ్డీల భారం అధికమైంది. అప్పులు తీరే దారిలేకపోవడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యేవారు. ఈ క్రమంలో పెన్నా నది దగ్గర మామిడి చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
3 మార్చ్ 2025:- పాణ్యం మండలంలోని బలపనూరు గ్రామానికి చెందిన రైతు వై.రామ్మోహన్ రెడ్డి (63) తన కుమారుడు గంగాధర్రెడ్డితో కలిసి 20 ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నారు. పదెకరాల సొంత పొలంలో వరి, కౌలుకు తీసుకున్న పొలంలో 5 మిరప, మరో 5 ఎకరాల్లో మినుము పంటలు సాగు చేశారు. పంట నష్టాలు రావడంతో 15 లక్షల అప్పు మీద పడింది. దాన్ని ఎలా తీర్చాలనే ఆవేదన పెరిగి ఇంట్లో ఎవరూ లేని సమయంలో రామ్మోహన్ రెడ్డి విషగు ళికలు మింగి ఆత్మహత్య చేసుకున్నారు..
4 మార్చ్ 2025:- నంద్యాల జిల్లా దొర్నిపాడు మండలం రామచంద్రాపురం గ్రామానికి చెందిన యువ కౌలు రైతు అక్కల కరుణాకర్ (20) తండ్రి అక్కల రవి పొలం సాగు నిమిత్తం సుమారు 15 లక్షలు అప్పు చేసి నాలుగు నెలల క్రితం మనస్తాపంతో మంచం పట్టి అనారోగ్యంతో మరణించాడు. దీంతో అప్పులు, ఉన్న పొలం బాధ్యత కొడుకు కరుణాకర్ పై పడింది. ఈ ఏడాది కూడా మూడెకరాల్లో పత్తి సాగు చేశాడు. అయితే దిగుబడులు తగ్గిపోవడంతో ఇక అప్పులు తీర్చలేననే ఆందోళనకు లోనయ్యాడు. రోజూ అప్పులు ఇచ్చిన వారు ఇంటి వద్దకు వచ్చి అడుగుతుండడంతో సమాధానం చెప్పలేక గడ్డిమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
6 మార్చ్ 2025:- వైయస్సార్ జిల్లా, మైలవరం మండలం దుగ్గనపల్లి గ్రామానికి చెందిన చీపాటు మోషే (50) అనే రైతు 6 ఎకరాల పొలంలో మిరప పంటను సాగు చేశారు. ఎకరాకు 2 లక్షల చొప్పున మొత్తం 12 లక్షలు ఖర్చు చేశారు. గతంలో కూడా వివిధ పంటలు వేయడం నష్టం వచ్చింది. మొత్తం 40 నుంచి 50 లక్షల వరకు అప్పులయ్యాయి. ఒకవైపు పంట దిగుబడి సరిగ్గా రాక పోవడం, మరో వైపు అప్పులు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి పెరగడంతో దిక్కు తోచని స్థితిలో తన పొలం వద్ద పురుగులు మంది తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
9 మార్చ్ 2025:- అల్లూరి సీతారామరాజు జిల్లా రాజవొమ్మంగి మండలం లాగరాయి గ్రామంలో గిరిజనుడు పోతుబండి సత్యనారాయణ తన రెండు ఎకరాల పొలంలో పొగాకు పంట సాగు చేశారు. పెట్టుబడి కోసం అప్పులు చేశారు. పంట దిగుబడి రాలేదు. అప్పులు తీరేలా లేవని మనస్తాపానికి గురై గురువారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుని చనిపోయారు.
10 మార్చ్ 2025:- కర్నూల్ జిల్లా తుగ్గలి మండల పరిధిలోని రాంపల్లి గ్రామానికి చెందిన ఎర్రబాటి వెంకటరాముడు (48) అనే రైతు తనకున్న 5 ఎకరాల వ్యవసాయ పొలంలో పంటల సాగు కోసం చేసిన 20 లక్షల అప్పులు ఎక్కువ కావడంతో వాటిని ఎలా తీర్చాలని మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకున్నారు.
12 మార్చ్ 2025:- కర్నూల్ జిల్లా కౌతాళం మండల పరిదిలోని ఎరిగేరి పంచాయతీ మజరా గ్రామమైన లక్ష్మి నగర్ కు చెందిన బైటిగేరి ఉలిగప్ప(60) తనకున్న 2 ఎకరాల సొంత పొలంతో పాటు మరో 8 ఎకరాలను కౌలుకు తీసుకుని మిరప పంట సాగు చేశారు. పంట పెట్టుబడి కోసం 5 లక్షల వరకు అప్పు చేశారు. ఈ ఏడాది మిరప పంటకు గిట్టుబాటు ధరలేక పెట్టిన పెట్టుబడి కూడా రాకపోవడంతో అప్పులు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి అధికమైంది. దీంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో పంటలకు తెచ్చుకున్న పురుగు మందును తాగి ఆత్మహత్య చేసుకున్నారు.
12 మార్చ్ 2025:- కాకినాడ తాళ్లరేవు పరిధి పత్తిగొందికి చెందిన కౌలురైతు పెచ్చెట్టి వెంకటేశ్వరరావు (45) కొంత సొంతభూమితో పాటు నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేశారు. నష్టాలు రావడంతో అప్పులు పెరిగి పొట్టచేతపట్టుకుని హైదరాబాద్ వెళ్లిపోయారు. ఇటీవల అక్కడి నుంచి తిరిగి వచ్చి కాకినాడలో కూలిపని చేసుకుని జీవనం సాగిస్తున్నారు. వ్యవసయంతో అప్పులు అధికమవడంతో వత్తిడి తట్టుకోలేక యానాం బీచ్కు చేరుకుని గడ్డి మందు తాగి ఆత్మహత్యకు చేసుకున్నారు.
13 మార్చ్ 2025:- కర్నూల్ జిల్లా తుగ్గలి మండలం పరిధిలోనే మారెళ్ళ గ్రామానికి చెందిన పుండుకూర రామాంజనేయులు (45) అనే రైతు తనకున్న వ్యవసాయ పొలముతో పాటు అదనంగా 10 ఎకరాలు కౌలుకుకి సాగు చేసుకుని కుటుంబాన్ని పోషించుకుంటూ ఉన్నారు, అయితే ఇటీవల పంటల సాగుకోసం చేసిన అప్పులు ఎక్కువ కావడంతో వాటిని ఎలా తీర్చాలనే మనోవేదనకు గురై వాము దొడ్డిలో పురుగు మందును తాగి ఆత్మహత్య చేసుకున్నారు.
15 మార్చ్ 2025:- గుంటూరు జిల్లా తాడికొండ మండలం బడేపురం గ్రామానికి చెందిన సంకురు హృదయరాజు (60) నాలుగు ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని పత్తి పంట సాగు చేశారు. పంట సాగు నిమిత్తం లక్షల్లో అప్పు చేశారు. అధిక వర్షాలు, తెగులు కారణంగా పంట దిగుబడి తగ్గి నష్టాలు రావడంతో అప్పు తీర్చడం కష్టమైంది. రుణదాతల నుంచి ఒత్తిడి పెరగడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. దీంతో ఇంట్లోనే గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు.

16 మార్చ్ 2025:- నంద్యాల జిల్లా రుద్రవరం మండలంలోని కోటకొండ గ్రామానికి చెందిన సుబ్బయ్య (40) అనే రైతు తనకు ఉన్న రెండు ఎకరాల పొలంతో పాటు మరికొంత పొలాన్ని కౌలుకు తీసుకొని పంటలు సాగు చేశారు. సాగు చేసిన పంటలు దిగుబడులు సక్రమంగా రాకపోవడంతో పంట పెట్టుబడుల కోసం తెచ్చిన రుణము అప్పులుగా మిగిలాయి. దాదాపురు 5 లక్షల పైగా అప్పులు ఉండడంతో ఇచ్చినవారు రుణము చెల్లించాలని ఒత్తిడి తేవడంతో చేసిన అప్పులు తీర్చలేక సుబ్బయ్య ఇంటి ముందర కల్లాపు చల్లే సౌభాగ్యం పొడిని నీటిలో కలుపుకొని తాగి ఆత్మహత్య చేసుకున్నారు.

16 మార్చ్ 2025:- వైయస్సార్ జిల్లా, వెంపల్లి, కుమ్మరాంపల్లె గ్రామానికి చెందిన మబ్బు గోపాల్ (46) పంటల సాగుకు 10 లక్షలకు పైగా అప్పు చేశారు. కొన్ని రోజులుగా ఆరోగ్యం సరిగ్గా లేదు. ఈ నేపథ్యంలో మనస్తాపం చెంది శనివారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో విషద్రావణం తాగి ఆత్మహత్య చేసుకున్నారు.
17 మార్చ్ 2025:- గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం తాళ్లూరు గ్రామానికి చెందిన డేగల వెంకట సత్యనారాయణ (36) నాలుగేళ్ల నుండి కౌలుకు పొలం తీసుకుని మిర్చి సాగుచేస్తున్నారు. ఈ ఏడాది రెండున్నర ఎకరాల్లో పంట వేశారు. నష్టం రావడంతో తీవ్ర మానస్తాపానికి గురై ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
19 మార్చ్ 2025:- గుంటూరు జిల్లా తాడికొండ గ్రామానికి చెందిన వట్టికూటి శ్రీనివాసరావు భార్య అరుణకుమారి(45) ఇరువురూ వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. వ్యవసా యంలో వరుస నష్టాలు రావడంతో గ్రామంలో తమకున్న మూడెకరాల పొలాన్ని అమ్మి అప్పులు తీర్చారు. అనంతరం పొలం కౌలుకు తీసుకుని వ్యవసాయం కొనసాగించారు. అప్పుడు కూడా తీవ్రంగా నష్టపోయారు. బాకీలు పెరిగిపోవడంతో కుటుంబ పోషణ కష్టంగా మారిందని అరుణకుమారి కొద్ది రోజులుగా తీవ్ర మనస్తాపానికి గురై ఆవేదనతో గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు.
19 మార్చ్ 2025:- వైఎస్‌ఆర్ జిల్లా ఖాజీపేట మండలం బి.కొత్తపల్లె పంచాయతీ బక్కాయపల్లె గ్రామానికి చెందిన రైతు పత్తి రామచంద్రారెడ్డి (41) తన సొంత భూమి రెండున్నర ఎకరాతోపాటు మరో ఐదు ఎకరాలను కౌలుకు తీసుకుని వరి, వివిధ రకాల పంటలను సాగు చేశారు. పంటల దిగుబడి సరిగా రాకపోవడంతో పెట్టుబడి కోసం తెచ్చిన అప్పులు 15 లక్షల వరకూ పేరుకుపోయాయి. అప్పులు తీర్చే మార్గం కనిపించకపోవడంతో తన పొలంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు.
20 మార్చ్ 2025:- ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం పోతలపాడు గ్రామానికి చెందిన రాచకొండ శీను (50) తన నాలుగు ఎకరాల భూమితోపాటు మరో రెండు ఎకరాలు కౌలుకు తీసుకుని మిర్చి, టమోటా, కంది పంటలు సాగు చేశాడు. ఈ ఏడాది కూడా 3 ఎకరాల్లో మిర్చి వేశారు. పంటలు తెగుళ్ల బారిన పడటంతో దిగుబడులు రాలేదు. వచ్చిన కొద్దిపాటి పంటకు గిట్టబాటు ధర లేకపోవటంతో సుమారు 10 లక్షల మేర అప్పులయ్యాయి దీంతో తీవ్ర మనస్తాపం చెందిన శ్రీను ఇంట్లోనే పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు.
21 మార్చ్ 2025:- కర్నూలు జిల్లా తుగ్గిలికి చెందిన రైతు ముక్కెళ్ల కౌలుట్లయ్య (66) తనకున్న ఆరు ఎకరాలతో పాటు మరో 11 ఎకరాల భూమి కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నారు. పంటలు సరిగా పండక, సాగుకు చేసిన అప్పులు 10 లక్షలకు చేరుకున్నాయి. వీటిని తీర్చే మార్గం లేక మనస్తాపానికి గురై పొలంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు.
21 మార్చ్ 2025:- ఉరవకొండ, కూడేరు మండలంలోని మరుట్ల-1 గ్రామానికి చెందిన గోపాల్(47)కు 5.5 ఎకరాల వ్యవసాయ పొలంలో మిరప పంట, టమాట, వంకాయ పంటలు సాగు చేశారు. వరుసగా నష్టాలు రావడంతో రూ.7.5 లక్షలకుపైగా అప్పులు అయ్యాయి. వాటిని చెల్లించాలన్న ఒత్తిడి అధికం అయ్యింది. ఈ క్రమంలో అప్పులు పుట్టక, పంటల దిగుబడి సరిగా రాక మనోవేదనతో 2025 మార్చ్ 18న పొలంలో పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. కుటుంబ సభ్యులు అతన్ని చికిత్స కోసం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యం పొందుతూ 21న మృతిచెందారు.
29 మార్చ్ 2025:- అన్నమయ్య జిల్లా, రైల్వేకోడూరు రూరల్ మండలంలోని అనంతరాజుపేట పంచాయతీ తూర్పుపల్లి అరుంధతీవాడకు చెందిన సుంకేసుల శ్రీనివాసులుకు ఒక ఏకార పొలం ఉంది. అందులోనే వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. వ్యవసాయం కలిసి రాకపోవడంతో సుమారు 10 లక్షల మేర అప్పు చేశాడు. అప్పు పెరిగి మనస్థాపం చెంది విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
30 మార్చ్ 2025:- ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలం కొత్త వేమవరం గ్రామానికి చెందిన గోపి (29) నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకుని మిర్చి పంట సాగు చేస్తున్నారు. నష్టాలు రావడంతో పెట్టుబడి కోసం తెచ్చిన అప్పులకు వడ్డీల భారం అధికమైంది. ఈ ఏడాది కూడా మిర్చికి తెగుళ్లు సోకడంతో దిగుబడులు తగ్గిపోయాయి. అప్పులు తీరే దారిలేకపోవడంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు.
30 మార్చ్ 2025:- నంద్యాల జిల్లా రామచంద్రాపురం గ్రామానికి చెందిన జమ్మి తిమ్మయ్య (42) నాలుగేళ్లుగా 3.50 ఎకరాలను కౌలుకు తీసుకుని సీడు పత్తి సాగు చేస్తున్నాడు. వాతావరణం అనుకూలించక ఆశించిన దిగుబడులు రాక అప్పులు పెరుగుతూ వచ్చాయి. ఈ ఏడాది కనీసం పెట్టుబడులు కూడా చేతికి అందలేదు. 15 లక్షల వరకు అప్పులు చేరడంతో మనస్తాపం చెంది గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

3 ఏప్రిల్ 2025 :- అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం మండలం మూరేవాండ్ల పల్లికి చెందిన రామయ్య భారత సైన్యంలో ఉద్యోగం చేశారు. ఆయన రిటైర్మెంట్ అనంతరం ప్రభుత్వం జీవనాధారం కోసం 1975వ సంవత్సరంలో అదే మండలంలోని తాటిగుంటపల్లి గ్రామ పరిధిలోని సర్వే నం.1051లో 5.53 ఎకరాల విస్తీర్ణానికి పట్టా మంజూరు చేసింది. రామయ్య మరణానంతరం అతని కుమారుడు రైతు వెంకటాద్రి తన పేరుపై భూమిని ఆన్లైన్ చేయాలని రెవెన్యూ అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగాడు. అయినా వారు పట్టించుకోలేదు. ఆ భూమిపై కన్నేసిన మూరేవాండ్లపల్లికి చెందిన మోహన్రెడ్డి, పెద్దవంక పల్లికి చెందిన శ్రీనివాసులురెడ్డి, టీడీపీ నాయకుడు నారాయణరెడ్డి.. ఇటీవల దానిని ఆక్రమించుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న వెంకటాద్రి ప్రజాసమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్కు ఫిర్యాదు చేశాడు. రెవెన్యూ అధికారులు ఆక్రమణదారులకే వత్తాసు పలకడంతో పాటు ఆ భూమితో సంబంధం లేదంటూ వెంకటాద్రితో సంతకాలు చేయించుకున్నారు. దీంతో మనస్తాపానికి గురైన వెంకటాద్రి గురువారం తెల్లవారుజామున తన ఇంటి పక్క నున్న చెట్టుకు ఉరి వేసుకున్నాడు. తన చావుకు నారాయణరెడ్డి, మోహన్రెడ్డి, శ్రీనివాసులురెడ్డి, తహ శీల్దారు పమిలేటి కారణమని సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు. అదే విషయాన్ని చేతిపైనా రాసుకున్నాడు. వారిపై చర్యలు తీసుకోవాలని కోరాడు. తన ఆత్మహత్య తర్వాతైనా.. ఆ భూమిని తన కుమారుడు, కుమార్తె పేరిట ఆన్లైన్ చేయాలని విజ్ఞప్తిచేశాడు.

4 ఏప్రిల్ 2025 :- పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ మండలం సింగనవలస గ్రామంలో మునుకోటి చిన్నారావు (60) పంటల సాగు, కుటుంబ అవసరాల కోసం సుమరు నాలుగు లక్షలు అప్పు చేశారు. తండ్రి చేసిన అప్పుతో తనకు సంబంధం లేదని కుమారుడు చెప్పడంతో చిన్నారావు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. దీంతో పశువుల పాకలో ఉరివేసుకొని మృతి చెందారు.

5 ఏప్రిల్ 2025 :- పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం మిట్టమీదపల్లె గ్రామానికి చెందిన బండి కోటేశ్వరరావు (43) తన ఐదెకరాల సొంత పొలంతోపాటు ఎనిమిది ఎకరాలను కౌలుకు తీసుకుని ఏటా పత్తి, మిర్చి పంటలను సాగు చేసేవారు. ఈ ఏడాది కూడా సొంత పొలంతో పాటు మరో ఐదు ఎకరాలు కౌలుకు తీసుకుని పత్తి, మిర్చి, మొక్కజొన్న పంటలను సాగు చేశారు. పంటలు దగ్గకపోవడంతో పంటల సాగు కోసం చేసిన అప్పులకు వడ్డీలు కలిపి సుమారు రూ.35 లక్షలు అయ్యాయి. అప్పులు తీరే దారిలేకపోడంతో తన పొలం పక్కనే ఉన్న కుంటలోకి దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు.
5 ఏప్రిల్ 2025 :- పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం కందులవారిపాలెం గ్రామానికి చెందిన నిజాంపట్నం శ్రీనివాసరావు (49) తనకున్న ఎకరం సొంత పొలంతో పాటు మరో మూడెకరాలు కౌలుకు తీసుకొని పత్తి, మిర్చి పంటలను సాగు చేస్తున్నారు. వ్యవసాయంలో వచ్చిన ఒడిదుడుకుల కారణంగా 10 లక్షల వరకూ అప్పులపాలయ్యారు. అప్పులు తీరే దారిలేక పొలంలో గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు.
5 ఏప్రిల్ 2025 :- అనంతపురం జిల్లా బెళుగుప్పకు చెందిన రైతు హనుమంతరెడ్డి (44) తనకున్న ఆరెకరాల పొలంలో వర్షాధార పంటలు సాగు చేసేవారు. పంటల పెట్టుబడుల కోసం 10 లక్షల వరకు అప్పులు చేశారు. ఆశించిన స్థాయిలో పంటలు చేతికందకపోవడంతో అప్పులకు వడ్డీల భారం అధికమైంది. మనస్తాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు
6 ఏప్రిల్ 2025 :- గుంటూరు రూరల్, వట్టిచెరుకూరు మండలం కారంపూడిపాడు గ్రామానికి చెందిన రైతు అన్నవరపు వసంతరావు (63) తనకున్న కొద్ది పాటి పొలంతోపాటు గ్రామంలో మరో రెండు ఎకరాలు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తుంటాడు. వసంతరావు ఈ క్రమంలో పండించిన పంటలకు మద్దతు ధరలేకపోవటంతో అప్పులు పెరిగిపోయాయి. అప్పుల వాళ్ళ వేధింపులు పెరిగి మనస్థాపంతో తన పొలంలో కలుపు మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
7 ఏప్రిల్ 2025 :- కర్నూలు జిల్లా దేవనకొండ మండలం బేతపల్లికి చెందిన రైతు మాదిగ రాజుకు (42) రెండెకరాల భూమి ఉంది. పోలం పనులతో పాటు ఖాళీ సమయాల్లో దినసరి కూలీగా వెళ్తూ జీవనం సాగిస్తున్నాడు. సాగు కలిసిరాక, పెట్టుబడులు కూడా చేతికందకపోవడంతో మనస్తాపానికి లోనయ్యాడు. దీనికి తోడు పొలంలో బోర్లు వేసినా నీరుపడలేదు. చేసిన అప్పులు తీర్చే మార్గం కనబడలేదు. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలో తోచక పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
8 ఏప్రిల్ 2025 :- కర్నూలు జిల్లా హలహర్వి మండల కేంద్రానికి చెందిన తలారి శ్రీనివాసులు (33) 6 ఎకరాల కౌలు వ్యవసాయం చేస్తున్నాడు. గత 3ఏళ్ల నుంచి మిరప సాగు చేశాడు. ఈ ఏడు మిర్చి రేటు పతనం కావడంతో 6 ఎకరాల్లో పంటను నష్టపోయాడు. దీంతో 5 లక్షల్లో నష్టం వాటిల్లి అప్పులపాలయ్యాడు. చివరకు అప్పులు తీర్చే మార్గం కానరాక ఉరి వేసుకునీ ఆత్మహత్య చేసుకున్నాడు.
10 ఏప్రిల్ 2025 :- కర్నూల్ జిల్లా గోనెగండ్ల మండలంలోని ఐరన్బండ గ్రామంలో రైతు గొల్ల రామాంజనేయులు (42) వ్యవసాయం చేసుకొంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. వీరికి 1.65 ఎకరాల పొలం ఉండగా, అన్న వెంకటేశ్వర్లు పొలం నాలుగెకరాలు కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నారు. పత్తి, మిరప, ఉల్లి సాగుతో నష్టాలే మిగిలాయి. పంటల సాగుకు 10 లక్షల అప్పులు చేశారు. అవి తీర్చలేక మనస్తాపానికి గురై రామాంజనేయులు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు.

10 ఏప్రిల్ 2025 :- బాపట్ల జిల్లా నాగండ్ల గ్రామానికి చెందిన యువరైతు ఇసుకేపల్లి రఘు బాబు (28) మూడు ఎకరాలలో సీడ్ మొక్కజొన్న సాగు చేశాడు. అయితే కంపెనీ వారు చెప్పినవిధంగా దిగుబడి రాలేదు. వద్దంటే సంకరజాతి విత్తన మొక్కజొన్న సాగు చేసి నష్టపోయామని కుటుంబ సభ్యులు మందలించారు. దీంతో రఘుబాబు మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలో అప్పుల బాధలు కూడా ఎక్కువ అయ్యాయి. తాను మొక్కజొన్న సాగుచేసిన పంట పొలంలో ఉన్న బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
11 ఏప్రిల్ 2025 :- శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం పెద్ద కొజ్జిరియాకు చెందిన రైతు బల్లెడ నరసింహమూర్తి (58) తనకున్న ఎకరా పొలంతో పాటు మరో ఏడెకరాల భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. జీడి, మామిడి పంటల పెట్టుబడి కోసం ప్రయివేటు వడ్డీ వ్యాపారుల వద్ద అప్పులు చేశారు. ఆ అప్పు వడ్డీతో కలిసి 15 లక్షలు అయ్యింది. ఓ వైపు రుణదాతల ఒత్తిడి.. మరోవైపు ఆశించిన మేర దిగుబడి రాకపోవడంతో మనస్తాపానికి గురయ్య తోటకు వెళ్లి ఆత్మహత్య చేసుకున్నారు.
12 ఏప్రిల్ 2025 :- కర్నూలు జిల్లా కోడుమూరు మండలం రెమట గ్రామంలో కొమ్ము లక్ష్మన్న (39) పాలం కౌలుకు తీసుకుని జీవనం సాగిస్తున్నాడు. అయితే గత రెండేళ్లుగా నష్టాలే రావడంతో అప్పుల రూపంలో తెచ్చిన 6 లక్షలను ఎలా తీర్చాలో పాలుపోలేదు. ఈ నేపధ్యంలో గూడూరు వెళుతున్నానంటూ భార్యకు చెప్పి మార్గమధ్యంలో పురుగులమందు సేవించి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు లక్ష్మన్నను కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ చనిపోయాడు.
16 ఏప్రిల్ 2025 :- వైఎస్ఆర్ జిల్లా, ముద్దనూరు మండలం ఉప్పులూరు గ్రామానికి చెందిన కౌలు రైతు రామకృష్ణ 4ఎకరాల భూమి కౌలు తీసుకొని వంకాయ, బెండ, మిరప పంటలు సాగు చేశాడు. పంట సాగు చేసేందుకు పెట్టుబడి కోసం అప్పులు చేశాడు. పంట ఆశించిన దిగుబడి రాకపోవడంతో మనస్తాపానికి గురై ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
17 ఏప్రిల్ 2025 :- అనంతపురం జిల్లా గుమ్మమట్టకు చెందిన పోతలింగ (45) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిం చేవాడు. తనకున్న ఎకరా పొలంతో పాటు ఐదెకరాలు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. వ్యవసాయంలో పెట్టుబడులు కూడా చేతికందక సుమారుగా 8 లక్షల దాకా అప్పులయ్యాయి. ఈ క్రమంలో అప్పులు తీర్చే మార్గం లేక మనస్తాపానికి గురై గ్రామ శివారులోని చింతచెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
19 ఏప్రిల్ 2025 :- కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామళ్లకోట గ్రామానికి చెందిన మద్దిలేటి స్వామి (70) తనకున్న ఎకరం పొలంతోపాటు మరో 3 ఎకరాలను కౌలుకు తీసుకుని మొక్కజొన్న, మిరప, వేరుశనగ పంటలు సాగుచేస్తున్నారు. సాగు పెట్టుబడులతోపాటు కుటుంబ అవసరాల కోసం బ్యాంకులు, ప్రయివేటు వ్యక్తుల నుంచి సుమారు 30 లక్షల మేర అప్పులు చేశారు. ఆశించిన స్థాయిలో పంట దిగుబడులు లేకపోవడంతో అప్పులు చెల్లించలేక తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. దీంతో గ్రామ సమీపంలోని కంది పొలంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు.
19 ఏప్రిల్ 2025 :- గుంటూరు జిల్లా తెనాలి మండలం సంగంజాగర్లమూడికి చెందిన వాకా సుబ్రమణ్యం (53), వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తుంటాడు. రెండేళ్ల నుంచి వ్యవసాయంలో నష్టం వాటిల్లుతోంది. అప్పుల బాధతో మనస్తాపానికి గురయ్యాడు. చుండూరు మండలం వలివేరులో కౌలుకు తీసుకున్న పొలంలో కలుపు మందు తాగాడు. ఇతర రైతుల సమాచారంతో కుటుంబ సభ్యులు తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు.
26 ఏప్రిల్ 2025 :- కర్నూలు జిల్లా నందవరం మండలంలో బోయ రంగన్న (55) ఆరు ఎకరాలు కౌలుకు తీసుకుని పత్తి, మిరప, ఉల్లి తదితర పంటలు సాగు చేస్తున్నారు. పంటలు దిగుబడి రాకపోవడంతో సుమారు 20 లక్షల వరకు అప్పులు మిగిలాయి. అప్పుల భారం భరించలేక గురువారం సాయంత్రం పొలంలో పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు.
26 ఏప్రిల్ 2025 :- పల్నాడు జిల్లా వెల్దుర్తి గ్రామానికి చెందిన పులుసు వీరారెడ్డి (44) తనకున్న రెండెకరాల సొంత పొలంతోపాటు తొమ్మిది ఎకరాలు కౌలుకు తీసుకుని పత్తి, మిర్చి పంట సాగు చేస్తున్నారు. సరైన దిగుబడులు లేకపోవడంతో 25 లక్షలకుపైగా అప్పులయ్యాయి. అప్పులు తీరే మార్గం లేకపోవడంతో తన పొలంలోని చెట్టుకు ఉరేసుకుని మృతి చెందారు.
29 ఏప్రిల్ 2025 :- అనంతపురం జిల్లా బెళుగుప్ప మండలం గంగవరం గ్రామానికి చెందిన తలారి జయరాములు ఏటా 10 నుంచి 15 ఎకరాల్లోని మామిడి చెట్లను గుత్తకు తీసుకుని ఫల సాయాన్ని మార్కెట్కు తరలించేవాడు. ఈ క్రమంలో ఈ ఏడాది అదే గ్రామంలోని 12 ఎకరాల్లో మామిడి తోటను గుత్తకు తీసుకున్నాడు. ఇందుకు గాను చేసిన అప్పులకు వడ్డీల భారం పెరిగి 10 లక్షలకు పైగా చేరుకుంది. మామిడి దిగుబడులు సరిగా రాకపోవడంతో పాటు మార్కెట్లో గిట్టుబాటు ధరలు లేకపోవడంతో అప్పులు తీర్చే మార్గం కానరాక మామిడి తోటలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
30 ఏప్రిల్ 2025 :- ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురానికి చెందిన రైతు తోట రాంబాబుకు మూడు ఎకరాల పొలం ఉంది. రెండెకరాల్లో ఆయిల్పామ్, మిగతా ఎకరంలో వర్జీనియా పొగాకు వేశాడు. అలాగే తన సోదరికి చెందిన రెండు ఎకరాలు కౌలుకు తీసుకుని మొక్కజొన్న పంట వేశాడు. అయితే ఇటీవల గాలి, దుమారం భారీ వర్షానికి పొగాకు, మొక్కజొన్న దెబ్బతిన్నాయి. సేద్యం కలిసి రాకపోవడంతో అప్పుల పాలయ్యాడు. అవి ఎలా తీర్చాలో తెలియక తన ఆయిల్పామ్ తోటలో ఉన్న చింత చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
3 మే 2025:- అనంతపురం జిల్లా వెంకటాంపల్లి పెద్దతండా (రూప్లానాయక్ తండా)లో సబావత్ సాము నాయక్ కు నాలుగు ఎకరాల పాలం ఉంది. అందులో ఏడు దాకా బోర్లు వేయించాడు. బోర్ల ద్వారా వచ్చే నీటి ఆధారంగా మూడేళ్లుగా మిరప సాగు చేస్తున్నాడు. మరో ఐదు ఎకరాలు కౌలుకు తీసుకుని వేరుశనగ పెట్టాడు. అయితే పంటలు ఆశించిన స్థాయిలో చేతికి రాకపోవడంతో ఆర్థికంగా నష్టపోయాడు. పంటల సాగు, బోర్ల కోసం చేసిన అప్పులు 16 లక్షలకు చేరుకున్నాయి. వీటిని ఎలా తీర్చాలో అర్ధం కాక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
6 మే 2025:- అనంతపురం జిల్లా యల్లనూరు మండల నీర్జాం పల్లి కొట్టాల గ్రామంలో ఆర్ కృష్ణయ్యకు నాలుగు ఎకరాల వ్యవసాయ పొలం ఉంది. అందులో అరటి పంట సాగు చేస్తున్నారు. సాగు నిమిత్తం గత కొనేళ్లుగా దాదాపు 10 లక్షలు అప్పులు చేశారు. ఈ పంట చేతికొచ్చే సమయంలో గత నెలలో వీచిన ఈదురుగాలులకు అరటి చెట్లన్నీ నేలకూలాయి. పంట మొత్తం చేతికందకుండా పోవడంతో అప్పులు తీర్చే మార్గం కన్పించక మనస్తాపానికి గురయ్యారు. సోమవారం అర్ధరాత్రి ఇంట్లో కుటుంబ సభ్యులు నిద్రపోయాక ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
6 మే 2025:- కర్నూలు జిల్లా మద్దికెర పరిధిలోని పెరవలీ గ్రామంలో మంగలి నాగరాజుకు మూడు ఎకరాలు, పక్కన రైతు దగ్గర ఇంకో మూడు ఎకరాలు గుత్తకు తీసుకొని వ్యవసాయం పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. పంట పండగ పోవడంతో కుటుంబ జీవనం వ్యవసాయం ఖర్చులు కోసం 6 లక్షలు అప్పులు ఉండడంతో కుటుంబ జీవనం భారం కావడం వల్లే అప్పులు తీర్చలేక తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు.
8 మే 2025:- చిత్తూరు ఏ.కొత్తకోట పంచాయతీ ఎస్ అగ్రహారం గ్రామానికి చెందిన లోకేష్ (27) తమ పొలంలోని 5ఎకరాల్లో టమాట పంట సాగు చేశాడు. పంట సాగు కోసం లక్షలు ఖర్చు చేశాడు. అలాగే ట్రాక్టర్ కొనుగోలు చేశాడు. ఈఎంఐల తాకిడి అధికం కావడంతో ఆర్థిక భారం అధికమైంది. సాగు చేసిన పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో అప్పులు తీర్చలేక, ఈఎంఐలు కట్టలేక ఇబ్బందులు పడుతూ గ్రామంలో చీటీల నిర్వాహకుల నుంచి సైతం డబ్బులు తీసుకున్నాడు. అప్పులిచ్చిన వారి ఒత్తిళ్లు అధికం కావడంతో గ్రామానికి సమీపంలోని యల్లమ్మ గుంత సమీపం లోని చింతచెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
10 మే 2025:- గుంటూరుజిల్లా పోన్నూరు మండల పరిధి వెల్లలూరుకు చెందిన నక్కా నరసింహారావు(47) ఆరు ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని సాగు చేశారు. అందులో నష్టాలు రావడంతో 5 లక్షలు అప్పులయ్యాయి. వాటిని తీర్చలేక నరసింహారావు మనస్తాపానికి గురై గురువారం పురుగు మందు తాగి ఆత్మహత్యకి పాల్పడ్డారు.
13 మే 2025:- పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలంలోని చాగంటివారిపాలెం గ్రామానికి చెందిన ఆళ్ల ఆదినారాయణ (45) ఐదెకరాలు కౌలుకు తీసుకుని మిర్చి, పసుపు పంటలను సాగుచేస్తున్నారు. సుమారు 10 లక్షల వరకు అప్పుచేసి పెట్టుబడులు పెట్టారు. ఆశించిన దిగుబడులు లేకపోవడంతో పాటు ధరలు కూడా అంతంతమాత్రంగానే ఉండడంతో నష్టాలే వచ్చాయి. ఈ క్రమంలో అప్పులు తీర్చేమార్గం లేక తీవ్ర మనస్తాపానికి గురైన ఆదినారాయణ ఇంటి వద్దే గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు.
13 మే 2025:- నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలం భోజనం గ్రామానికి చెందిన కౌలు రైతు రాముడు (65) తనకున్న ఎకరా పొలంతో పాటు కౌలుకు తొమ్మిది ఎకరాల పొలం తీసుకుని వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఈ ఏడాది ఆరు ఎకరాల్లో పొగాకు పంట, నాలుగు ఎకరాల్లో వరి పంటను సాగు చేశారు. దాదాపు 12 లక్షల వరకు పెట్టుబడులు పెట్టారు. ఈ ఏడాది అకాల వర్షాలతో పంట దెబ్బతినడంతో పాటు దిగుబడి కూడా తగ్గిపోవడంతో తీవ్రంగా నష్టపోయారు. మరోపక్క పండిన పొగాకు పంటను వ్యాపారులు కొనుగోలు చేయకపోవడం, రుణదాతలు ఒత్తిడి చేయడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
14 మే 2025:- అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం కొత్తకోట గ్రామానికి చెందిన రవి యాదవ్ (27) తనకున్న తొమ్మిది ఎకరాల పొలంతో పాటు మరో ఎనిమిది ఎకరాలు కౌలుకు తీసుకుని మిర్చి పంట సాగు చేశారు. పంటల సాగు నిమిత్తం 10 లక్షల వరకు అప్పు చేశారు. ఈ ఏడాది మిర్చికి ధర లేకపోవడంతో పంట సాగు కోసం చేసిన అప్పులు తీర్చేమార్గం లేక మనస్తాం చెందారు. తన ఇంటి పక్కనే ఉన్న షెడ్లోకి వెళ్లి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
15 మే 2025:- పల్నాడు జిల్లా దుర్గి మండలం ఆత్మకూరు గ్రామానికి చెందిన కుప్పాల అయ్యప్పరెడ్డి (42) తనకున్న రెండెకరాలకు తోడు మరో నాలుగు ఎకరాలను కౌలుకు తీసుకుని మిర్చి, కంది పంటలు సాగు చేశాడు. పెట్టుబడులు, కూలీల ఖర్చు ఎక్కువై అప్పుల పాలయ్యాడు. పంట దిగుబడి బాగా వచ్చినప్పటికీ మద్దతు ధరలు లేక నష్టాల బారిన పడ్డాడు. అప్పులు ఎలా తీర్చాలో తెలియక మానసికంగా కుంగి పోయి పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
18 మే 2025:- అనంతపురం గుత్తి , తొండపాడు గ్రామానికి చెందిన గొల్ల మహేంద్ర కుమార్ (40) తనకున్న భూమితో పాటు కౌలుకు భూమిని తీసుకుని వర్షాధారం పంటలుగా వేరుశగన, ఇతర పంటలను సాగు చేసేవారు. పంటల సాగు నిమిత్తం దాదాపు 10 లక్షలు అప్పు చేశారు. పంటల దిగుబడి రాక చేసిన అప్పులు పెరిగిపోవడంతో మనస్తాపం చెందారు. చేసిన అప్పులు తీర్చే మార్గం లేక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
18 మే 2025:- పల్నాడు జిల్లా క్రోసూరు మండలం పీసపాడుకు చెందిన ఎర్రనేని చిన్న వెంకటేశ్వర్లు(59) రెండు ఎకరాల్లో మిర్చి పంట వేశాడు. పండించిన పంటకు ధర పలకలేదు. సుమారు రూ.10 లక్షలు వరకు అప్పుల పాలయ్యాడు. దీంతో మనస్థాపానికి గురై ఆదివారం ఉదయం పురుగు మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. గమనించిన బంధువులు, స్థానికులు సత్తెనపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు.

18 మే 2025:- కర్నూలు జిల్లా ఆదోని మండలం కపటి గ్రామానికి చెందిన బోయ నాగేంద్ర(30) తన నాలుగెకరాల పొలంలో రెండేళ్లుగా మిరప, ఉల్లి పంటలు సాగుచేశాడు. గిట్టుబాటు ధర లేక తీవ్రంగా నష్టపోయాడు. సుమారు రూ.8 లక్షలు అప్పు తీర్చే మార్గంలేక ఆదివారం ఇంట్లో ఉరి వేసుకున్నాడు.
18 మే 2025:- నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలంలోని రుద్రవరం గ్రామానికి చెందిన రైతు నాగేశ్వరరావుకు (40) ఎనిమిది ఎకరాల పొలం ఉంది. పత్తి, మిరప, చేమంతి, ఉల్లితో పాటు వివిధ రకాల పంటలు సాగు చేసినా అనుకున్నంత దిగుబడులు రాలేదు. పంటల సాగు, బోరు బావులు తవ్వించడానికి సుమారు 20 లక్షల దాక అప్పులు చేశాడు. దిగుబడులు రాక, అప్పులు ఏవిధంగా తీర్చాలో తెలియక మనస్తాపానికి గురై ఈనెల ఇంట్లో ఎవ్వరు లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
21 మే 2025:- అనంతపురం జిల్లా బెళుగుప్ప మండల కేంద్రం వెంకటాద్రిపల్లిలో రైతు గోరువ మంజునాథ్(45) తనకున్న ఏడెకరాల పొలంతోపాటు అన్నదమ్ముల పొలాలను కౌలుకు తీసుకుని సాగు చేసేవాడు. అయితే వరుస పంట నష్టాలతో అప్పులు భారంగా పరిణమించాయి. తనకున్న ఏడు ఎకరాల భూమిని విక్రయించి కొంతమేర అప్పులు తీర్చాడు. ఇంకా అప్పు ఉండడంతో ఇంటి నుంచి వెళ్లిపోయాడు. సెల్ ఫోన్ స్విచాఫ్ చేశాడు తన ఇంటికి కొద్ది దూరంలోనే ఖాళీగా ఉన్న బంధువుల ఇంటి బాత్ రూమ్ లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
23 మే 2025:- బాపట్ల జిల్లా పంగులూరు మండలం జనకవరం గ్రామానికి చెందిన తలపనేని శ్రీనాథ్ (34) ఏడు ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని నల్లబర్లీ పొగాకు పంటను సాగుచేశారు. పంట సిద్ధమైనా కొనుగోలుకు బయ్యర్లు ముందుకు రాలేదు. దీంతో ఆయన తీవ్ర ఆవేదనకు గరయ్యాడు. అప్పుల వాళ్ల ఒత్తిడి పెరగడం, పండిన పంట అమ్ముడుపోకపోవడంతో తీవ్ర ఒత్తిడికి గురై పొలం వద్దకు వెళ్ళి పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన వెలుగుచూసిన సమయానికి రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు, గొట్టిపాటి రవికుమార్ తదితరులు జనకవరం ప్రాంతానికి సమీపంలోనే ఉన్నారు అయినా, మంత్రులు ఆ గ్రామానికి వెళ్లడం కానీ, ఆత్మహత్యకు పాల్పడిన రైతు కుటుంబ సభ్యులను పరామర్శించడంగాని. చేయకపోవడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
23 మే 2025:- నంద్యాల జిల్లా సంజామల మండలం ఆకుమల్ల గ్రామానికి చెందిన వంగూరు స్వప్న (41) వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. ఈ నేపథ్యంలో పంటల సాగుకు 12లక్షల వరకు అప్పు చేసింది. వాటిని తీర్చే దారి లేక పేడ రంగు సేవించి ఆత్మహత్య చేసుకుంది.
24 మే 2025:- విజయనగరం జిల్లా జామి గ్రామానికి చెందిన రైతు గొర్రె ఎర్నాయుడు (45) నాలుగేళ్ల కిందట కొనుగోలు చేసిన ట్రాక్టర్ పనిచేయకపోవడం, వ్యవసాయం లాభసాటిగా లేకపోవడంతో సుమారు 16 లక్షలు వరకు అప్పులయ్యాయి. దీంతో ఆయన మద్యానికి బానిసయ్యాడు. శుక్రవారం ఉదయం మద్యం మత్తులో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆస్పత్రిలో చికిత్స పోందుతూ చనిపోయారు.
27 మే 2025:- పల్నాడు జిల్లా మాచవరం మండలంలోని పిన్నెల్లి గ్రామానికి చెందిన కొనకంచి శ్రీనివాసరావు(45) తనకున్న ఉన్న ఎకరం పొలంతో పాటుగా మరో ఆరెకరాలు కౌలుకు తీసుకొని మిర్చి, పత్తి పంటలు సాగుచేస్తున్నారు. పంటలకు సరైన ధరలు రాకపోవంతో నష్టం రావడంతోపాటు 20 లక్షల వరకు అప్పులయ్యాయి. వీటిని తీర్చడానికి తనకున్న ఎకరం పొలాన్ని అమ్ముకోగా వచ్చిన 13 లక్షలతో కొంతమేర అప్పులు తీర్చాడు. అయినా ఇంకా అప్పులు మిగిలి ఉండడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన శ్రీనివాసరావు మంగళవారం తన పొలం సమీపంలో పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
1 జూన్ 2025 :- అనకపల్లి కుమారపురం గ్రామానికి చెందిన పల్లెల సూరిబాబు(60) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. వ్యవసాయ పెట్టుబడులకు గాను 5 లక్షలు, తన చిన్న కుమారుడు శ్రీనివాస్ కోసం దస్తావేజులు తనఖా పెట్టి ప్రైవేటు వ్యక్తుల నుంచి మరో 5 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. వీటిని తీర్చే మార్గం లేక నిత్యం మద్యానికి బానిసై వడ్డీ చెల్లించే పరిస్థితులు లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు పడుతు తీవ్ర మనస్తాపం చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
1 జూన్ 2025 :- అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం పడమటి కోడిపల్లి పంచాయతీ పొబ్బర్లపల్లిలో బోయ నాగరాజు (35) తనకున్న ఐదెకరాలలో వ్యవసాయ చేస్తూ జీవనం సాగించేవారు. పొలంలో పంటల సాగుకు, బోరుబావుల తవ్వకానికి, కుటుంబ అవసరాలకు దాదాపు పది లక్షల వరకూ అప్పులు చేశారు. పంటలు సరిగా పండకపోవడంతో చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేక మనోవేదనకు గురయ్యారు. ఇంటిలో ఎవరూ లేని సమయంలో ఇంటి దులానికి చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు చేసుకున్నారు.
4 జూన్ 2025 :- అనంతపురం జిల్లా పుట్లూరు మండలంలొ రామానుజలరెడ్డి (35) తనకున్న ఐదెకరాల్లో చీనీ పంట సాగు చేశారు. ఆదాయం సరిగా లేకపోవడంతో వాటిని చీనీ చెట్లను తొలగించి మొక్కజొన్న వేశారు. దీనికీ సరైన ధర రాక నష్టాలు చవి చూశారు. పంటల సాగు నిమిత్తం చేసిన దాదాపు 20 లక్షల అప్పు తీర్చడం కష్టం కావడంతో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు.
5 జూన్ 2025 :- మార్కాపురం పట్టణంలోని సుందరయ్య కాలనీలో నివాసం ఉండే కౌలు రైతు రాజారపు పెద్ద ఎలమందయ్య (55) గత పది సంవత్సరాలుగా వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తూ వస్తున్నాడు. ఈ సీజన్‌లో 7 ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని మిరప పంట సాగు చేశాడు. పంట సాగు కోసం పెట్టుబడుల పరంగా సుమారు 25 లక్షల వరకు అప్పులు చేశారు. ఈ సంవత్సరం మిరప పంటకు గిట్టుబాటు ధర లేకపోవడం, మార్కెట్లో ధరలు పడిపోవడం వల్ల తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాడు. పంట కోత కూలీలకు కూడా ధర లభించకపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఆత్మహత్య చేసుకున్నారు.
6 జూన్ 2025 :- అనంతపురం జిల్లా కూడేరు మండంలోని కొర్రకోడుకు చెందిన రామాంజనేయులుకి 5 ఎకరాల పొలం ఉంది. కొన్నేళ్లుగా పొలంలో వేరుశనగ, ఇతర పంటలు సాగు చేస్తూ వచ్చాడు. దిగుబడులు అంతంత మాత్రంగా రావడం, ధరలు లేక పెట్టుబడి కూడా దక్కలేదు. నాలుగైదు బోర్లు వేయించాడు. దీంతో పంటల పెట్టుబడులకు, బోర్లకు చేసిన అప్పులు అధికమయ్యాయి. రుణదాతల ఒత్తిళ్లు ఎక్కువవడంతో ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు .
7 జూన్ 2025 :- ప్రకాశం జిల్లా నెన్నూరుపాడు గ్రామానికి చెందిన చల్లా మధుసూదన్ రెడ్డి పొగాకుతో పాటు పలు పంటలు సాగు చేయటంతో గిట్టుబాటు ధర లేక సుమారు 10 లక్షల అప్పులయ్యాయి. అప్పు చేసి పొగాకు పంట పండించినా, గిట్టుబాటు ధర లేకపోవడంతో గత్యంతరం లేక ఆత్మహత్య చేసుకున్నరు.
8 జూన్ 2025 :- కర్నూలు జిల్లా తుగ్గలి మండలం గుడిసె గుప్పరాల్లకు చెందిన దబ్బల నాగన్న(58) తనకున్న మూడెకరాలతో పాటు మరో 10 ఎకరాలు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసుకుంటున్నాడు. తన పొలంలో 4 బోర్లు వేసేందుకు అప్పులు చేశాడు. అవి 10 లక్షలకు చేరుకున్నాయి. అప్పులు తీర్చే మార్గం కనిపించక శనివారం పొలం వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు.
13 జూన్ 2025 :- అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం పాపంపల్లి గ్రామానికి చెందిన గొల్ల జట్టింగప్ప (50)కు 1.50 ఎకరాల పొలం ఉంది. ఇందులో వర్షాధార పంటలు సాగు చేస్తున్నారు. పంటల సాగు నిమిత్తం దాదాపు 7 లక్షల వరకు అప్పులు చేశారు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యలో పంటలు చేతికందలేదు. దీంతో అప్పులు తీర్చడం కష్టమైంది. అప్పులు తీరే మార్గం లేకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్య చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
17 జూన్ 2025 :- పల్నాడు జిల్లా, నాదెండ్ల మండలం, తూబాడు గ్రామానికి చెందిన సిరిబోయిన గోపాలరావు (43) తన సొంత పొలం 30 సెంట్లు ఉంది. ఏటా కొంత భూమి కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. చీడపీడల కారణంగా మిర్చి దిగుబడి రాక నష్టపోయాడు. పొగాకు సాగులో దిగుబడి బాగున్నా ధరలు పతనమవటం, కొనేనాథుడు లేకపోవటంతో ఇంటి సమీ పంలోనే పొగాకు నిల్వచేసి పట్టలు కప్పి భద్రప రిచాడు. సాగులో సుమారు రూ.20-25 లక్షల వరకు నష్టాలపాలయ్యాడు. ధర లేకపోవడం, రుణదాతల నుంచి ఒత్తిళ్లు రావడంతో ఆత్మహత్య చేసుకున్నాడు.

17 జూన్ 2025 :- పల్నాడు జిల్లా, నాదెండ్ల మండల కేంద్రమైన నాదెండ్ల రామాపురం కాలనీకి చెందిన నాస్యం ఆదినారాయణ (45) ఒకటిన్నర ఎకరం సొంతభూమితో పాటూ 70 ఎకరాలు కౌలుకు తీసుకుని సాగు చేస్తుంటాడు. పెరిగిన సాగు ఖర్చులు, తగ్గిన దిగుబడులు, ధరల పతనంతో తీవ్రంగా నష్టపోయాడు. సుమారు రూ.50-60 లక్షల వరకు అప్పులున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. అప్పుల బాధతో పురుగుమందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు.
17 జూన్ 2025 :- పల్నాడు జిల్లా ఈపూరు మండలం కొచ్చర్ల గ్రామానికి చెందిన బండి కొండయ్య (52) ఆరు ఎకరాలను కౌలుకు తీసుకొని మిర్చి, పొగాకు, వరి పంటలను సాగు చేశారు. పంటల సాగునిమిత్తం అప్పులు చేశారు. పంటలు దిగుబడి సరిగా రాకపోవడం, పండిన పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో అప్పులు తీర్చలేక తీవ్ర మనస్తాపం చెందారు. గ్రామానికి సమీపంలోని పొలాల్లో చెట్టుకు ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు.
20 జూన్ 2025 :- అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం ఆమిద్యాల గ్రామానికి చెందిన ఆంజనేయులు (22) ఐదు ఎకరాల పొలం ఉంది.. కుటుంబ సభ్యులతో కలిసి వర్షాధార పంటల కింద వేరుశనగ, పప్పుశనగ పంటలు సాగు చేసేవారు. సాగు నిమిత్తం దాదాపు రూ.పది లక్షలు అప్పులు చేశారు. వర్షాభావం నేపథ్యంలో పంటలు చేతికందలేదు. దీంతో చేసిన అప్పులకు వడ్డీల భారం అధికమైంది. అప్పులు తీరే దారిలేక ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు.
20 జూన్ 2025 :- చిత్తురు జిల్ల నిండ్ర మండలంలోని శ్రీరామపురం పంచాయతీ శ్రీరామాపురం గ్రామానికి చెందిన యవరైతు హేమాద్రి(29) తనకున్న పొలంతో పాటు మరో మూడు ఎకరాలు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. వ్యవసాయంలో నష్టాలు రావడంతో కొంత వరకు బ్యాంక్ లోను, ఇతరుల వద్ద అప్పు చేశాడు. ఇలా సుమారు 10 లక్షల వరకు అప్పు చేశాడు. రుణదాతల ఒత్తిళ్లు భరించలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు.
21 జూన్ 2025 :- చిత్తూరు జిల్లా పుంగనూరు మండలంలో బోడేవారిపల్లి పంచాయతీ ఈడిగపల్లెకి చెందిన వెంకటరమణ (48) ఎకరా పొలం కౌలుకు తీసుకొని అప్పుచేసి టమాటా పంట సాగు చేశారు. మార్కెట్‌లో టమాటాకు గిట్టుబాటు ధర లేకపోవడంతో తీవ్రంగా నష్టపోయారు. పంట సాగు, కుటుంబ పోషణ, పిల్లల చదువు నిమిత్తం 4 లక్షల వరకు అప్పు చేశారు. అప్పు తీర్చే మార్గం లేకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. సమీపంలోని పొలాల్లో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
22 జూన్ 2025 :- కర్నూలు జిల్లా తుగ్గలి మండలం పెండేకల్లుకు చెందిన రైతు నాగభూషి రాజశేఖర్ (27) తనకున్న ఎకరంన్నర పొలంతో పాటు మరో 6 ఎకరాలు కౌలు తీసుకుని వ్యవసాయం చేసుకుంటున్నాడు. పంటలు సరిగ్గా పండక, పెట్టిన పెట్టుబడులు కూడా రాకపోవడంతో 8 లక్షలు అప్పులు చేశాడు. అవి తీర్చే మార్గం కనిపించక మనస్తా పానికి గురై ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
24 జూన్ 2025 :- తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండలం సంగాయగూడెంలో కౌలు రైతు ఉండవల్లి రమేష్ (44) ఈ ఏడాది 35 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని పొగాకు సాగు చేశాడు. అమ్మకాలు ప్రారంభమై రెండు నెలలు దాటినా, మార్కెట్లో గిట్టుబాటు ధర రావడం లేదు. మరోవైపు సాగుకు చేసిన అప్పుల భారం పెరిగింది. పండించిన పంట అమ్ముడు కాకపోవడం, మార్కెట్లో గిట్టుబాటు ధర రాకపోవడంతో దిక్కుతోచక పొలంలోనే పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నడు.
29 జూన్ 2025 :- గుంటూరు జిల్లా ప్రత్తిపాడుకు చెందిన చల్లగిరి నాగరాజు (45) పదేళ్లుగా కౌలు వ్యవసాయం చేస్తున్నాడు. ఈ ఏడాది మిరప సాగు చేపట్టాడు. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు పంట దెబ్బతిని దిగుబడి రాలేదు. దీంతో పంటపై చేసిన అప్పులు పెరిగిపోయాయి. అదే సమయంలో కొత్త ఇంటిని నిర్మించడం, అందుకోసం మరికొంత అప్పు చేశాడు. సుమారు 20 లక్షల మేర అప్పుల పాలయ్యాడు. అరకొరగా వచ్చిన పంటకు గిట్టుబాటు లేకపోవ డంతో అప్పులు ఎలా తీర్చాలో పాలుపోలేదు. తీవ్ర మనస్తాపానికి గురయ్య పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు.
6 జులై 2025:- అనంతపురం జిల్లా ఉరవకొండ కూడేరులో స్థానికంగా ప్రధాన వీధిలో నివసించే గురుస్వామి (55) కి తనకున్న 11.5 ఎకరాల్లో కొన్నేళ్లుగా వేరు సెనగ, వరి సాగు చేస్తున్నాడు. రెండేళ్లుగా వ్యవసాయంలో వరుస నష్టాలు ఎదురవగా. 6 లక్షలు అప్పు లయ్యాయి. వాటిని తీర్చేమార్గం లేక మనస్తాపానికి గురై ఇంటి నుంచి వెళ్లి పొలంలో చెట్టుకు ఉరేసుకుని బలవన్నరణానికి పాల్పడ్డారు.
7 జులై 2025:- అనంతపురం జిల్లా రాప్తాడులో కరుణాకర్ (32) తనకున్న వ్యవసాయ పొలంలో పంటలు సాగు చేస్తూ జీవనం సాగించేవారు. పంటలు పండక పోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తనకు తెలిసిన వారి దగ్గర సుమారు 15 లక్షల వరకు అప్పులు చేశారు. వాటిని తీర్చలేక మదనపడేవాడు. ఈ నేపధ్యంలో పొలంలో గడ్డికి కొట్టే పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు.
8 జులై 2025:- అనంతపురం జిల్లా విడపనకల్ మండలంలో పాల్తూరు గ్రామానికి చెందిన గణేష్ (24) మూడు ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని మిరప పంటను సాగు చేస్తున్నారు. దిగుబడి సరిగా రాక, అరకొరగా పండిన పంటకు ధర లేక తీవ్రంగా నష్టపోయారు. దాదాపు 8 లక్షల మేరకు అప్పులు చేశారు. ముందస్తు కౌలు చెల్లిస్తూ లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టారు. దిగుబడి రాకపోవడంతో అప్పులు ఎలా తీర్చాలో తెలియక తీవ్ర మనోవేదనకు గురయ్యారు. గ్రామ సమీపంలోని చెట్టుకు ఉరి వేసుకుని ఆయన ఆత్మహత్య చేసుకున్నారు.
8 జులై 2025:- అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం కొప్పలకొండ గ్రామానికి చెందిన ఓబులపతి (41) ఎకరం పొలంతో పాటు మరో నాలుగు ఎకరాల భూమి కౌలుకు తీసుకుని వరి సాగు చేసేవారు. పంట పెట్టుబడి కోసం 8 లక్షల అప్పులు చేశాడు. పంటలు పండక అప్పులు తీర్చలేకపోయాడు. రుణదాతల ఒత్తిళ్లు ఎక్కువ కావడంతో పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు.
10 జులై 2025:- కర్నూల్ జిల్లా నందవరం మండల పరిధిలోని వరప్రతాప్(30) రెండు ఎకరాలు మిరప పంట సాగు చేశారు. పంటలు సరిగ్గా లేక అప్పుల పాలయ్యాడు. దాంతో పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నారు.
11 జులై 2025:- నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలంలోని ఈర్నపాడుకు చెందిన రైతు వెంకట సుబ్బయ్యకు గ్రామంలో మూడు ఎకరాల పొలం ఉండగా, మరో 15 ఎకరాలు కౌలుకు తీసుకొని వరిపంట సాగుచేశారు. పంటకు గిట్టుబాటు ధరలభించక నష్టాల పాలయ్యాడు. 15 లక్షల వరకు అప్పులు ఉండగా, ఎలా తీర్చాలో తెలియక తీవ్ర మనస్తాపానికి లోనయ్యాడు. గురువారం మధ్యాహ్నం తన ఇంట్లోనే పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు.
11 జులై 2025:- నంద్యాల జిల్లా ముత్తలూరుకు చెందిన రైతు నంద్యాల భాస్కర్ రెడ్డి (48) తనకున్న రెండెకరాల పొలంతో పాటు మరో 19 ఎకరాలను కౌలుకు తీసుకొని పంటలు సాగు చేసేవారు. సాగు చేసిన వరి, మిరప పంట దిగుబడులు సరిగా రాకపోవడంతో తీవ్రంగా నష్టం వచ్చింది. దీంతో పంట పెట్టుబడుల కోసం చేసిన అప్పులు మొత్తం 19 లక్షలకు చేరాయి. వీటిని ఎలా తీర్చాలోనని మనోవేదనకు గురై ఆలమూరు గ్రామ సమీపంలో ఉన్న దొడ్లవాగు సమీపంలో పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు.
12 జులై 2025:- నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం బత్తులూరుపాడు గ్రామానికి చెందిన కౌలు రైతు సంజీవరెడ్డి (52) ఆరు ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని మిరప పంటను సాగు చేశారు. పంటకు దిగుబడి రాకవడంతోపాటు అరకొర పండిన పంటకు గిట్టుబాటు ధర కూడా లభిచంలేదు. పంట సాగు కోసం సుమారు 10 లక్షల వరకు అప్పు చేశారు. రుణ దాతల ఒత్తిడి తాళలేక రెండు రోజుల క్రితం సంజీవరెడ్డి ఇంటి నుండి వెళ్లిపోయారు. బనగానపల్లె రైల్వే స్టేషన్ పరిధిలో ఉన్న పొలాల్లో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు.
12 జులై 2025:- కృష్ణా జిల్లా పెదపారుపూడి మండలం మోపర్రులో నాగినేని అనీల్ (31) 3 ఎకరాలు కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. 2024-25లో వచ్చిన తుపానుకు వరి పంట పూర్తిగా మునిగి పోయింది. దీంతో పెట్టిన ఖర్చులు రాక అప్పుల పాలయ్యాడు. రబీలో మినుము పంట అమ్ము కోలేకపోయాడు. సుమారు 10 లక్షల వరకు అప్పులు చేయడంతో వారి వేధింపులు భరించలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుని మృతి చెందాడు .
15 జులై 2025:- వైయస్సార్ కడప జిల్లా మైలవరం మండలం దన్నవాడ గ్రామానికి చెందిన పులిచెర్ల పెద్ద పాపిరెడ్డి (49) వ్యవసాయంలో పంట దిగుబడి సక్రమంగా రాక అప్పులు ఎక్కువ కావడం, అప్పుతీరే మార్గం లేక జమ్మలమడుగు-తాడిపత్రి బైపాస్ రోడ్డు పక్కన ముళ్లపొదల వద్ద పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు.
16 జులై 2025:- గుంటూరు జిల్లా తాడికొండ మండలంలోని నిడుముక్కల గ్రామానికి చెందిన నెప్పల్లి సుబ్బారావు (60)కు ఎకరం పొలం ఉంది. దీనికితోడు మరో 20 ఎకరాలను కౌలుకు తీసుకుని రెండేళ్లుగా సాగు చేస్తున్నాడు. అధిక వర్షాల కారణంగా పత్తిపంట దెబ్బతినడంతో తీవ్ర అప్పులు పాలైన సుబ్బారావు ఇంట్లో ఎవరూ లేని సమయంలో గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు.
17 జులై 2025:- కర్నూలు జిల్లా, దేవనకొండ మండలం గుడిమిరాళ్ల గ్రామానికి చెందిన గువ్వల రంగస్వామి(45) తనకున్న మూడు ఎకరాల పొలంతో పాటు మరో రెండు ఎకరాలను కౌలుకు తీసుకుని పంటలు పండించేవారు. గొర్రెలు, పొట్టేళ్ల పెంపకంతో జీవనం సాగించేవాడు. అయితే గతేడాది పంటలు పండలేదు. దాదాపు 8 లక్షలు దాకా అప్పు చేశాడు. తనకున్న గొర్రెలను అమ్మినా అప్పు తీరకపోవడంతో అప్పుల బాధతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు.

25 జులై 2025:- గుంటూరు జిల్ల ప్రత్తిపాడుకు చెందిన మరకా సత్యనారాయణ(42) 10 ఎకరాలకు కౌలు చేశారు. తెగుళ్లు, నల్లతామర పురుగు ప్రభావంతో మిర్చిలో దిగుబడి తీవ్రంగా పడిపోవడం, గులాబీ రంగు పురుగు ప్రభావంతో పత్తి పంటలో నష్టం వచ్చింది. అలాగే 7 ఎకరాల్లో పొగాకు పంటను సాగు చేశారు. పంటలకు పెట్టుబడి కోసం ప్రయివేటు వ్యక్తుల నుంచి వడ్డీకి అప్పులు తీసుకున్నారు. నష్టాలు రావడంతో అప్పులు తీర్చలేకపోవడంతో అసలు, వడ్డీ కలిపి పెరిగాయి. డబ్బులు ఇవ్వాలంటూ అప్పులు ఇచ్చిన వారు తీవ్ర స్థాయిలో ఒత్తిడి చేస్తున్నారు. దీంతో అప్పులు ఎలా తీర్చాలా.. అని మానసికంగా బాధపడుతున్నారు. మనస్తాపానికి గురైన సత్యనారాయణ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు.
3 ఆగస్టు 2025:- కర్నూలు జిల్లా, కృష్ణగిరి మండలం పోతుగల్లు గ్రామానికి చెందిన బోయ మాదన్న (55), తనకు ఉన్న నాలుగు ఎకరాల పొలంలో బోర్లు వేసేందుకు భారీగా ఖర్చు చేయగా, ఒక్క దాంట్లో మాత్రమే కొద్దిపాటి నీళ్లు పడ్డాయి. అలాగే పంట పెట్టుబడులతోపాటు, కుటుంబ ఖర్చుల కోసం 8 లక్షల వరకూ అప్పులు చేశాడు. గత నెల 31న పొలానికి నీరు పెట్టేందుకు కుమార్తెతోపాటు పొలానికి వెళ్లాడు. కొట్టం వద్దకు వెళ్లి వస్తానని చెప్పి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
4 ఆగస్టు 2025:- ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలంలోని ఓబులాపురం గ్రామానికి చెందిన తొట్టెంపూడి దిలీప్ కుమార్ (30) 5.50 ఎకరాలను కౌలుకు తీసుకున్నాడు. పొలంలో పొగాకు సాగు చేసి తీవ్రనష్టం చవిచూశాడు. అనంతరం చిక్కుడు, ఆముదాలు వేశాడు. సాగు అవసరాల కోసం తెలిసినవారి నుంచి 8 లక్షల మేర అప్పులు చేశాడు. ఒక వైపు పొగాకులో తీవ్రనష్టం చవిచూడటమే కాకుండా ప్రస్తుతం పొలంలో వేసిన చిక్కుడు, ఆముదాల పంట అంతంత మాత్రం కాపు రావడంతో చేసిన అప్పులు చెల్లించే మార్గం తెలియక ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
7 ఆగస్టు 2025:- గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం కోయవారిపాలెం గ్రామానికి చెందిన ముప్పాళ్ళ నాగార్జున చౌదరి (కోయవారిపాలెం తెలుగు యువత అధ్యక్షుడు) గత సంవత్సరం 8 ఎకరాల్లో పొగాకు పంట వేశాడు. గిట్టుబాటు ధర లేక అప్పులు అవడం వల్ల మనస్థాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. గతంలో పొగాకు పంటకు మంచి గిట్టుబాటు ధర ఉండటంతో ఈ సంవత్సరం రైతులందరూ కూడా ఎక్కువ శాతం ఒక పంట వేయడం జరిగింది. అయితే కంపెనీలు మాత్రం పొగాకు కొనక పోవడం వల్ల ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఆత్మహత్యలు జరుగుతున్నాయి.
7 ఆగస్టు 2025:- వైయస్సార్ కడప జిల్లా మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోని ఎల్లంపల్లెకు చెందిన రైతు మూలే ఇంద్రసేనారెడ్డి (41)కి నాలుగు ఎకరాల వ్యవసాయ పొలం ఉంది. అందులో ఉల్లి, టమోటా పంటలు సాగు చేసేవారు. వ్యవసాయంతో పాటు సప్లేయర్స్ దుకాణాన్ని కూడా కొంతకాలం నిర్వహించారు. వ్యవసాయంలో వరుసగా నష్టాలు రావడంతో సుమారుగా 15 లక్షలు అప్పుల పాలయ్యారు. దీంతో మనస్తాపం చెంది పంట పొలంలోనే చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
కూటమి ప్రభుత్వం వచ్చాక రైతుల ఆత్మహత్యలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఇంకా 5ఏళ్ళల్లో ఎంతమంది ప్రాణాలు ఈ ప్రభుత్వం పోట్టన పెట్టుకుంటుందో. ఇది ఇలా ఉంటే వ్యవసాయశాఖ మంత్రి అచ్చంనాయుడు గారు 2024 జూన్ నుండి మార్చ్ 7 వరకు కెవలం 39 మంది రైతులు మాత్రమే ఆత్మహత్యలు చేసుకునట్టు వారికి మాత్రమే త్వరలో 7 లక్షల పరిహారం ఇవనునట్టు అసెంబ్లీలో ప్రకటించారు. వాస్తవానికి ప్రణాలు తీసుకున్న రైతన్నల లెక్క ప్రభుత్వం చెప్పిన లెక్క కన్నా అధికంగా ఉనట్టు స్పష్టంగా కనిపిస్తుంది ..
No comments: