1. వైఎస్సార్ రైతు భరోసా
ఐదెకరాల లోపు ఉన్న చిన్న, సన్నకారు రైతులందరికీ రూ.50 వేలు ఇస్తాం. ఏటా మేలో నాలుగేళ్ల పాటు రూ.12,500 లను ఇస్తాం. రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి. రూ.2 వేల కోట్లతో ప్రకృతి విపత్తుల సహాయక నిధి.
(లబ్ధి పొందనున్న రైతు కుటుంబాలు: 66 లక్షలు)
2. వైఎస్సార్ ఆసరా
అక్కా చెల్లెమ్మల్లారా.. ఈ రోజు వరకు మీకున్న డ్వాక్రా రుణాలను అధికారంలోకి రాగానే పూర్తిగా మాఫీ చేసి 4 దఫాలుగా నేరుగా మీ చేతికే ఇస్తాం. అక్షరాలా 15 వేల కోట్లు మాఫీ చేస్తాం. సున్నా వడ్డీకే రుణాలిస్తాం.
(లబ్ధి పొందనున్న డ్వాక్రా మహిళల సంఖ్య: 89 లక్షలు)
3. పింఛన్ల పెంపు
ప్రతి అవ్వాతాతకి, వికలాంగులకు ప్రస్తుతం అందజేస్తున్న పింఛన్ రూ.1000 నుంచి 2000 పెంచి పక్కాగా అందిస్తాం.
(లబ్ధిదారుల సంఖ్య: 45 లక్షలు)
4. అమ్మఒడి
పేదింటి పిల్లల చదువులకు ఏ తల్లీ భయపడొద్దు. ఇంట్లో ఇద్దరి పిల్లలకు.. 1 నుంచి 5వ తరగతి వరకు నెలకు రూ. వెయ్యి, 6 నుంచి 10వ తరగతి దాకా రూ.1500, ఇంటర్ చదువులకు 2000 తల్లులకు అందిస్తాం.
(లబ్ధి పొందనున్న విద్యార్థులు: 40 లక్షలు)
5. పేదలందరికీ ఇళ్లు
పేదలందరికీ ఇళ్లు కట్టిస్తాం. ఇల్లు ఇచ్చే రోజునే ఆ ఇంట్లోని నా అక్క చెల్లెమ్మల పేరుతో రిజిస్ట్రేషన్ చేయిస్తాం. డబ్బు అవసరమైతే ఇంటిని తనఖాపెట్టి పావలావడ్డీకే రుణం.
(లబ్ధి పొందనున్న కుటుంబాలు: 25 లక్షలు)
6. ఆరోగ్య శ్రీకి పూర్వ వైభవం
ఆరోగ్యశ్రీకి బడ్జెట్‌లో పూర్తి స్థాయిలో నిధులు కేటాయిస్తాం. సంపాదించే వ్యక్తి జబ్బు పడితే ఆ కుటుంబం బతకడానికి డబ్బులు అందిస్తాం. కిడ్నీ వ్యాధి గ్రస్తులకు ప్రత్యేకంగా పింఛన్.
(లబ్ధి పొందనున్న కుటుంబాలు : 1.38 కోట్లు)
7. ఫీజు రీయింబర్స్‌మెంట్
పేదవాడి చదువుకు అయ్యే ఖర్చును పూర్తిగా భరిస్తాం. ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో పాటు వసతి, భోజనం కోసం ప్రత్యేకంగా రూ.20 వేలు అందిస్తాం.
(లబ్ధి పొందనున్న విద్యార్థులు : 15.80 లక్షలు)
8. జలయజ్ఞం
దివంగత మహానేత వైఎస్ కలలు కన్న జలయజ్ఞాన్ని పూర్తి చేస్తాం. అన్ని ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన చేపడతాం.
( అదనంగా సాగు నీరు అందేది : 56 లక్షల ఎకరాలకు)
9. దశల వారీగా మద్య నిషేధం
కాపురాల్లో మద్యం చిచ్చుపెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి. అందుకే అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు దశల్లో మద్యాన్ని నిషేధిస్తాం.
(రాష్ట్ర ప్రజలందరికీ ప్రయోజనకరమే)
మద్య నిషేధం ఇలా..
అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు దశల్లో మద్యాన్ని నిషేధిస్తాం. మద్యం ఇంటింటా కాపురాల్లో చిచ్చు పెడుతోంది. ఈ కారణంగా ఎన్ని జీవితాలు సర్వనాశనమవుతున్నాయో నాకు తెలుసు. రోడ్ల మీద జరిగే ప్రమాదాలే కాదు. మద్యం కారణంగా లక్షల ఇళ్లల్లో మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి. మద్య నిషేధం అన్నది ఒక్కరోజులో అమలు సాధ్యం కాదు. ఈ వాస్తవం అర్ధం చేసుకోబట్టే మూడు దశల్లో ఈ పని చేస్తానని, అందరి కుటుంబాలకు వెలుగులు ఇస్తానని మాట ఇస్తున్నా. –వైఎస్ జగన్
1. దుకాణాల సంఖ్య తగ్గించి అదే సమయంలో బెల్టుషాపులపై ఉక్కుపాదం మోపుతాం. మొదటి దశలోనే మద్యం వల్ల కుటుంబాలు ఎలా నాశనమవుతాయన్నది సినిమా, టీవీల ద్వారా పెద్ద ఎత్తున ప్రచారం కల్పిస్తాం. మద్యం నిషేదం కోసం ఉద్యమం నడిపిన చరిత్ర మన రాష్ట్రంలోనే మీడియాకు ఉంది. వారందరి సహాయ సహకారాలు తీసుకుంటాం. మద్యం ధరలను షాకు కొట్టేలా పెంచుతాం.
2. మద్యం ధరలు పేద, మద్య తరగతి వారికి అందుబాటులో లేకుండా ఇంకా ఇంకా షాకు కొట్టేలా పెంచుతాం. మద్యం తాగితే కలిగే నష్టాలు, మద్యం తాగకుండా వచ్చేలాభాలను మరింత ఎక్కువగా మీడియా ద్వారా ప్రచారం చేస్తాం. ధూమ పాన వ్యతిరేక ప్రచారం మాదిరి మద్యపాన నిషేదించడానికి కేంద్ర ప్రభుత్వం, ఇతర రాష్ట్రాలు, ఉన్నత న్యాయస్థానాలు పూనుకునేలా వారిని ఒప్పించడానికి అడుగులు వేస్తాం. ప్రతి నియోజకవర్గంలో రీహాబిలిటేషన్ సెంటర్లు పెట్టి మద్యం మానుకోవడానికి ముందుకొచ్చే వారికి వైద్యం అందజేసి, వారికి తోడుగా నిలబెడతాం.
3. మద్యాన్ని కోటీశ్వర్లు మాత్రమే కొనుగొలు చేసేలా మద్యాన్ని ఐదు, మూడు నక్షత్రాల హోటళ్లలో మాత్రమే లభించేలా నియంత్రణ చేస్తాం. తాగి ఒకవేళ లివర్ చెడిపోతే ఏ అమెరికాకో వెళ్లి వైద్యం చేసుకునే స్థోమత ఉన్న వారికే మద్యం అందుబాటులోకి వస్తుంది. తాగి చెడిపోతే వాళ్లే చెడిపోతారు. మద్యాన్ని నియంత్రించేలా రేట్లు విపరీతంగా పెంచడమే కాకుండా కొత్త చట్టాలు తెస్తాం. మద్యం తయారు చేసినా, మద్యం అమ్మినా ఆ శిక్షలు భారీగా ఉండేలా.. ఏడేళ్లు పాటు జైలుకు పోయేలా చట్టాలను మారుస్తాం. ఈ మూడు దశల్లో మద్యాన్ని నిషేధిస్తాం. ప్రతి కుటుంబంలో చిరునవ్వులు ఉండాలని చేస్తా ఉన్నాం.
జగన్ ప్రకటించిన నవరత్నాలు
Reviewed by surya
on
2:12 PM
Rating:
No comments: